చిన్న ఆలోచన.. ఎండల్లో పెద్ద ఉపశమనం

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ: జుక్కల్ మండల కేంద్రంలోని లాడేగాం చౌరస్తా వద్ద ఉన్న జైభవాని టీ పాయింట్ యజమాని లక్ష్మణ్ తన వినూత్న ఆలోచనతో వినియోగదారుల ప్రశంసలు అందుకుంటున్నారు.

టీ తాగేందుకు వచ్చే వారి ద్విచక్ర వాహనాలు ఎండకు గురికాకుండా ఉండేందుకు ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టీ పాయింట్ ముందు ప్రధాన రహదారి పనులు కొనసాగుతుండటంతో, వినియోగదారులు తమ వాహనాలను ఎండలోనే నిలిపివేయాల్సి వస్తోంది.

తీవ్రమైన ఎండల కారణంగా ద్విచక్ర వాహనాల సీట్లు అధిక వేడికి గురవుతున్నాయని గుర్తించిన లక్ష్మణ్, దీనికి సరళమైన పరిష్కారాన్ని అమలు చేస్తున్నారు. ఒక పెద్ద పాత్రలో గోనె సంచులను నీటిలో నానబెట్టి, టీ పాయింట్‌కు వచ్చే వాహనాల సీట్లపై వాటిని పరుస్తున్నారు.

వినియోగదారులు టీ తాగి వెళ్లే సమయంలో ఆ గోనె సంచులను తొలగించడం వల్ల వాహనాల సీట్లు చల్లగా ఉంటున్నాయి. దీంతో వాహనదారులు ఎండ వేడి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించగలుగుతున్నారు.

లక్ష్మణ్ చేసిన ఈ చిన్న ప్రయత్నం ఎండల్లో పెద్ద ఉపశమనంగా మారిందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ఆయన సేవా భావాన్ని అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply