పాత కక్షలతో.. కార్పొరేటర్‌పై హత్యాయత్నం
- ఇద్దరు నిందితుల అరెస్ట్
- ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
- సీసీటీవీ ఫుటేజీతో అసలు విషయం వెలుగులోకి..
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : పాత కక్షలతో ఓ కార్పొరేటర్ పై పథకం ప్రకారం జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం చేసిన నిందితులు ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా అసలు విషయం వెలుగులకు వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్‌పై జరిగిన హత్యాయత్నం కేసును త్రీ టౌన్ పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పాత కక్షలను మనసులో పెట్టుకొని పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి హత్యకు యత్నించినట్లు విచారణలో తేలింది.
జూన్ 17న రాత్రి సుమారు 11 గంటలకు కిసాన్‌నగర్‌లోని రామనయ్య టిఫిన్ సెంటర్ సమీపంలో వేణుప్రసాద్ బైకుపై ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన తెలుపు రంగు కారు బలంగా ఢీకొట్టగా, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన స్థలం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో సాంకేతిక ఆధారాలు, ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయగా, సుంచు కిషోర్, సుద్దాల ప్రణయ్ @ జానీలు పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని హత్యకు కుట్ర పన్నినట్లు గుర్తించారు.
నిందితులు బాధితుడి రోజువారీ కదలికలను గమనించి జూన్ 17న రాత్రి అతడిని వెంబడించారు. టయోటా గ్లాంజా కారుతో ఉద్దేశపూర్వకంగా వెనుక నుంచి ఢీకొట్టి హత్యకు యత్నించారు. బాధితుడు మరణించాడని భావించి అక్కడి నుంచి పరారయ్యారు. విశ్వసనీయ సమాచారంతో జూన్ 24న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన టయోటా గ్లాంజా కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 109 రీడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు కరీంనగర్ త్రీ టౌన్ సీఐ జి. తిరుమల్ తెలిపారు.
