చినుకు పడితే చాలు..
వరంగల్‌లో రోడ్లు జలమయం
హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ: వరంగల్ మహానగరంలో వర్షపు నీటి సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి భారీగా వర్షపాతం లేకపోయినా నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోవడం, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు లోతట్టు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగిన దృశ్యాలు కనిపించాయి. దీంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. గతంలో భారీ వర్షాల సమయంలో ఎదురైన వరద పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతాయా అన్న భయం ప్రజలను వెంటాడుతోంది.
47 లోతట్టు ప్రాంతాలపై ప్రభావం
వరంగల్ నగర పరిధిలో సుమారు 47 లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటి సమస్యకు గురయ్యే అవకాశం ఉన్నట్లు జీడబ్ల్యూఎంసీ అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ప్రజలు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే డ్రైనేజీల శుభ్రత, నీటి ప్రవాహ మార్గాల నిర్వహణ వంటి పనులు చేపట్టాల్సి ఉండగా, సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని పలువురు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం కోరుతున్న ప్రజలు
పన్నుల వసూళ్లలో అధికారులు ముందుండటంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రతి వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తరచూ నీరు నిలిచే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
