Karimnagar | ఉగ్రవాద నిర్మూలనే మోదీ సర్కార్ లక్ష్యం – బండి సంజయ్

..పెహల్గాం ఘటన తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు
..ఉగ్రవాద నిర్మూలనకు యుద్దంలో పాల్గొనేందుకు ప్రజలు సిద్దమయ్యారు
…ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో వెలుగు చూసిన దేశ సైనిక సత్తా

కరీంనగర్ ఆంధ్రప్రభ -ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పెహల్గాం ఘటన తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్దంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్దమయ్యారన్నారు.

పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ద్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు.
ప్రపంచంలో టెర్రరిజాన్ని అణిచివేసే శక్తి సామర్ధ్యాలు భారత్ కు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. పెహల్గాం ఘటన అనంతరం భారత సైన్యం టెర్రరిస్టుల స్థావరాలను గుర్తించి ధ్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులను మట్టుబెట్టిన మన సైన్యం ధైర్య సాహసాలను చూశామన్నారు.

పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ ఆ దేశం ఆర్ధిక సాయం చేస్తోందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొన్నారు బండి సంజయ్. ముంబయి పేలుళ్లు, లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ పేలుళ్లు, మక్కా మసీదు పేలుళ్ల తరువాత దేశ ప్రజల్లో మార్పులు వచ్చాయన్నారు. అవసరమైతే దేశం పక్షాన టెర్రరిజంపై యుద్దం చేసేందుకు సిద్దంగా ఉండటం సంతోషకరమన్నారు.

పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో సామాన్య ప్రజలను, వారి ఆవాసాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయాలనుకుందని, టెక్నాలజీని ఉపయోగించుకుని వాటిని తిప్పికొట్టిన ఘనత మన సైన్యానిదేనని ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో అమిత్ షా సారధ్యంలో టెర్రరిజం ఏ రూపంలో అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సైన్యానికి మద్దతుగా నిలవడం దేశ భక్తికి నిదర్శనమని అన్నారు. చిన్నా పెద్దా ముసలి ముతక తేడా లేకుండా టెర్రరిజం అంతం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మట్టుపెట్టాల్సిందే. ఇందులో మరో ఆలోచనే లేదని యాంటీ టెర్రరిజం డే సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం వాళ్లు ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *