మొక్కజొన్న దిగుమతిలో ప్రభుత్వ వైఫల్యం

మొక్కజొన్న దిగుమతిలో ప్రభుత్వ వైఫల్యం

  • సిపిఐ నల్లబెల్లి మండల కార్యద ర్శి బట్టు సాంబయ్య విమర్శలు

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మొక్కజొన్న ధాన్యాన్ని గోడౌన్లలో దిగుమతి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ నల్లబెల్లి మండల కార్యదర్శి బట్టు సాంబయ్య తీవ్రంగా విమర్శించారు. మండల కేంద్రంలోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు అయి పేరుకుపోయి ఉండగా, వాటిని గోడౌన్లకు తరలించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్‌కు టెండర్ ఇచ్చినా, ఏప్రిల్ 23 నుంచి 30 మధ్య వాహనాలు సమకూర్చినప్పటికీ అగ్రిమెంట్ పత్రాలు ఇవ్వకపోవడంతో అతను సేవలు నిలిపివేశాడని తెలిపారు.

దీంతో రైతులే స్వచ్ఛందంగా ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలను ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని కేంద్రానికి తరలించినా, గోడౌన్లలో స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, సొసైటీ గోడౌన్లో ధాన్యాన్ని దిగుమతి చేయడానికి హమాలీలు కూలీ చెల్లింపులపై స్పష్టత లేకపోవడంతో నిరాకరించారు. “మాకు డబ్బులు ఎవరు ఇస్తారో హామీ ఇవ్వాలి” అని వారు షట్టర్లు మూసి వెళ్లిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు, ఎమ్మార్వో జోక్యం చేసుకుని సాయంత్రం లెక్కలు చూసి చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినా హమాలీలు వినలేదు.

దీంతో రైతులు తమ వాహనాలను రోడ్డుపై అడ్డంగా నిలిపి ధర్నాకు దిగారు. 100కు పైగా ట్రాక్టర్లు, 10 డీసీఎంలు, 8 లారీలతో వచ్చిన ధాన్యం గోదాముల వద్దే నిలిచిపోవడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక వాతావరణ మార్పులతో వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ధాన్యం తడిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం మాత్రం రైతు మేళాలతో సంబరాలు చేసుకుంటోందని సాంబయ్య మండిపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ కేంద్రాలను సందర్శించి సమస్యలపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గోడౌన్లలో ఖాళీ స్థలం కల్పించడం, హమాలీలకు కూలీ చెల్లింపులపై స్పష్టత ఇవ్వడం, ధాన్యం తక్షణం దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.