Kadiri | తరలివచ్చిన భక్తజనం

Kadiri | తరలివచ్చిన భక్తజనం


Kadiri | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీవారి జన్మ నక్షత్రం అయిన స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం కదిరి (Kadiri) సమీపంలోని స్తోతాద్రి గిరిప్రదక్షిణలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నవ నారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా వెలసిన ఏకైక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

కదిరి పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్మర వాండ్లపల్లి గ్రామ సమీపంలో కొండల లక్ష్మీనరసింహుడిగా శ్రీవారు వెలిశారని… ఖాద్రీ పురాణంలో పేర్కొనబడింది. ఈ ప్రాంతంలోనే శ్రీ నరసింహ స్వామి తొలిసారిగా పాదం మోపారని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో ప్రజల సమేతంగా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతుంటారు. అంతటి మహత్యం కలిగిన స్తోతాద్రికి ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.

స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం నుంచి అర్చకులు, భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. గోవింద నామస్మరణ, హరి కీర్తనలు, భజనలతో మారుమోగిన వాతావరణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో స్తోతాద్రి (కదిరి కొండ) చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక హారతి నిర్వహించిన అనంతరం స్తోతాద్రి గిరిప్రదక్షిణను భక్తులు అత్యంత ఉత్సాహంతో చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో కదిరి కొండ పరిసరాలు కిటకిటలాడాయి.

Kadiri

గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులకు (Devotees) ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు భక్తులకు మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా కదిరి పట్టణానికి చెందిన ప్రముఖులు డా. శంకర్, బైక్ శ్రీనివాసులు, సిద్ధా నారాయణ, మల్లారపు గింగిశెట్టి, జయచంద్ర, కాయల నాగప్ప తదితరులు, అలాగే వీవర్స్ కాలనీ వాసులు కలిసి కదిరి కొండ వద్ద మహాప్రసాదం (అల్పాహారం) ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలు భక్తుల మన్ననలను పొందాయి.

స్తోతాద్రి గిరిప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారులు, పట్టణ ప్రముఖులు, సేవా సమితి సభ్యులు, స్వచ్ఛంద సేవకులకు ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు కలగాలని ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున ప్రార్థిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ గిరిప్రదక్షిణ భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a Reply