Science Fair | జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్…

Science Fair | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థులకు జ్ఞానం పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జిల్లా స్థాయిలో ఈ నెల 19వ తేదీన సైన్స్ ప్రదర్శనశాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి. జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మార్గదర్శకాలు విడుదల చేశారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖాధికారులకు, పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. సైన్స్ ఫెయిర్ ఎన్ సి ఇ ఆర్ టీ, ఆర్ బివిపి, బెంగళూరుకు చెందిన వి ఐ టీ ఎం సమన్వయంతో నిర్వహించబడుతున్న సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు.
సైన్స్ ఫెయిర్ థీమ్.. ప్రధాన థీమ్ లో భాగంగా వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం.. స్టెమ్ ను రూపొందించాలన్నారు. ఉప-థీమ్‌లు అనగా గ్రూప్ ప్రాజెక్టులు ఒక్కో ఉపథీమ్‌కు ఒకటి తయారు చేయాలన్నారు. స్థిరమైన వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి అనే అంశంతో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత మోడలింగ్, ఆరోగ్యం & పరిశుభ్రత, నీటి సంరక్షణ, నిర్వహణ చేపట్టాలన్నారు.
ప్రతి జిల్లా నుంచి 2 వ్యక్తిగత ప్రాజెక్టులు, 2 ఉపాధ్యాయ ప్రాజెక్టులు ఎంపిక చేయాలన్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, భూ అంతరిక్ష శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, బయోసైన్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అంశాలు ఉండాలన్నారు. పాఠశాల స్థాయిలో తరువాత 17వ తేదీన మండల స్థాయిలోను ఈనెల 19 వ తేదిన జిల్లా స్థాయిలో సైన్స్ ఫెయిర్ నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో మొత్తం 11 ప్రదర్శనలు ఎంపిక చేస్తామన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో నిర్వహించి విద్యార్థులను, ఉపాధ్యాయులను మండల స్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్ లో పాల్గొనేటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు.
మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల, మండల స్థాయి సైన్స్ ఫెయిర్‌ల నిర్వహణను పర్యవేక్షించాలి. అక్కడ ఎంపికైన వివరాలను నిర్ణీత సమయంలో పంపించవలెను. షెడ్యూల్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో సైన్స్ సంబంధించిన అంశాలను డీఎస్ఓ సుందరరావును, సైన్స్ కోఆర్డినేటర్ ను K.V సుబ్బారెడ్డిని ఎన్ జి ఎస్ కోఆర్డినేటర్ చంద్ర శేఖర రెడ్డిని, దీక్ష కోఆర్డినేటర్ జి.నాగేంద్ర కుమార్, లను సంప్రదించాలని డిఈవో ఆదేశించారు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ సదస్సు డిసెంబర్ 23, 24 తేదీలలో విజయవాడలోని పోరంకిలో ఉన్న మురళి రిసార్ట్స్‌లో నిర్వహిస్తామన్నారు.
