జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతికి కాంగ్రెస్ ఘన నివాళి
తెలంగాణ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని పిలుపు
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ సూచన మేరకు నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు జయశంకర్, గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంత బలం చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడని కొనియాడారు.
డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, జయశంకర్, గద్దర్ ఇద్దరూ తెలంగాణ సమాజానికి విశిష్ట సేవలందించారని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, డీసీసీ జనరల్ సెక్రటరీలు రాములు యాదవ్, సాయిబాబా, మీడియా సెల్ నాయకుడు సీజే బెనహర్, మాజీ కౌన్సిలర్ గంజి ఆంజనేయులు, కార్పొరేటర్లు తాహెర్, అవేజ్, గులాం జహీర్, కాంగ్రెస్ నాయకులు మొహిజ్, అక్బర్ బసీద్, అలీమ్ భాయ్, నవాబ్ ఎం.డి. నవాజ్ ఖురేషి, కాజా నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
