శ్రీశైలం గిరి ప్రదక్షిణకు శ్రీకారం
- ఉమామహేశ్వర క్షేత్రం నుంచి బయలుదేరిన ఆలయ చైర్మన్, పాలకమండలి సభ్యులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా , అచ్చంపేట మండలం, రంగాపురం గ్రామంలోని ప్రసిద్ధ ఉమామహేశ్వర క్షేత్రం నుంచి శ్రీశైలం గిరి ప్రదక్షిణ యాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి, , ఆలయ పాలకవర్గ కమిటీ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో యాత్రకు బయలుదేరారు. గిరి ప్రదక్షిణ మూడు రోజుల పాటు కొనసాగనుంది.
యాత్రలో భాగంగా తొలుత శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం త్రిపురాంతకం, జ్యోతి సిద్ధవటం, అలంపురం పుణ్యక్షేత్రాలను సందర్శించి చివరగా ఉమామహేశ్వర క్షేత్రానికి చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగియనుంది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే విశిష్టమైన యాత్ర అని పేర్కొన్నారు. ఆలయ అధికారులు, పాలకవర్గ సభ్యులు యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
