ఆటోలో ఎక్కే ముందు… ఇక ఒక్క స్కాన్ చాలు!

ఆటోలో ఎక్కే ముందు… ఇక ఒక్క స్కాన్ చాలు!
నగరి, ఆంధ్రప్రభ: ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నివారణ లక్ష్యంగా చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు “జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నగరిలో శనివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, అదనపు ఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా సంయుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆటోరిక్షాలకు ప్రత్యేక పోలీసు గుర్తింపు సంఖ్యతో పాటు క్యూ ఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లను అతికించారు.

క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత ఆటో, డ్రైవర్, యజమాని, వాహనానికి సంబంధించిన అధికారిక వివరాలు తక్షణమే అందుబాటులోకి వచ్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రయాణికుల భద్రత మెరుగుపడటంతో పాటు నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో కూడా పోలీసులకు సౌలభ్యం కలుగుతుందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఆటోరిక్షా ప్రయాణాలను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
జిల్లాలోని ప్రతి ఆటోను ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ పరిధిలోకి తీసుకువస్తున్నామని, అవసరమైన సమయంలో సంబంధిత వివరాలను వెంటనే గుర్తించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఆటోల్లో ప్రయాణించే వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని వివరించారు.
ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అధిక వేగంతో వాహనాలు నడపరాదని సూచించారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో సమాజం మొత్తం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం చిత్తూరు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని అన్నారు. సాధారణ ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆటోరిక్షాల్లో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.
ప్రత్యేక పోలీసు గుర్తింపు సంఖ్యలు, క్యూ ఆర్ కోడ్ వ్యవస్థ ద్వారా ఆటో సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతుందని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన నాటికను ప్రదర్శించారు. డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో, కుటుంబాలు, సమాజంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో హృద్యంగా వివరించారు.
అదేవిధంగా ఆటో డ్రైవర్లకు యూనిఫాం వస్త్రాలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగరి అర్బన్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు, నగరి రూరల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మురళీమోహన్, నగరి సబ్‌డివిజన్ పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు.
