Jai Jawan Jai Kisan : వావ్ వేల్పు చెర్ల Andhra Prabha Spl News

Jai Jawan Jai Kisan : వావ్ వేల్పు చెర్ల Andhra Prabha Spl News
- దేశభక్తికి సలాం
- ఒకే ఇంట్లో జైకిసాస్.. జై జవాన్
- రైతన్నకు.. వీర జవానుకు కృష్ణా మిల్క్ యూనియన్ ఘన సత్కారం
(ఏలూరు , ఆంధ్రప్రభ )

Jai Jawan Jai Kisan : “జై జవాన్ – జై కిసాన్” నినాదానికి ప్రత్యక్ష సాక్ష్యం … ఏలూరు జిల్లా ముసునూరు మండలం వేల్పుచెర్ల . ఈ గ్రామంలో శనివారం భావోద్వేగ సన్నివేశం ఊరి జనాన్ని కదిలించింది. కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఇక్కడి పాడి రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు జి. లక్ష్మణ్ కుమారుడు జి. శ్రీకాంత్ పదేళ్లుగా సి ఆర్ పి ఎఫ్ జవానుగా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని రైతు చలసానికి తెలిపారు. దీంతో స్పందింన చైర్మన్ .. దేశ రక్షణకు సరిహద్దులొ పహారా కాస్తున్న జవాన్ శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు. రైతు కుటుంబం నుంచి దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న యువ జవాను నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ రైతు – జవాను ఇద్దరూ దేశానికి రెండు కళ్లవంటివారని పేర్కొన్నారు. “దేశానికి అన్నం పెట్టేది రైతు… దేశాన్ని కాపాడేది జవాను. రైతు చెమటతో దేశం బతుకుతుంది… జవాను త్యాగంతో దేశం సురక్షితంగా నిలుస్తుంది” అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. అలాగే తమ కుమారుడిని దేశ రక్షణ కోసం పంపిన తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులని కొనియాడారు. అలాంటి కుటుంబాలను సమాజం ఎప్పటికీ గౌరవంతో గుర్తుంచుకోవాలని అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన జవాను దేశ సేవలో ఉండటం వేల్పుచెర్ల గ్రామానికే కాకుండా మొత్తం రైతాంగానికే స్ఫూర్తిదాయకమని తెలిపారు. ముఖ్యంగా కృష్ణా మిల్క్ యూనియన్‌కు చెందిన పాడి రైతు కుమారుడు కావడం యూనియన్‌కు గర్వకారణమని చెప్పారు.
Jai Jawan Jai Kisan రైతు అన్నం పెడితే…

రైతు దేశానికి అన్నం పెడితే… రైతు కొడుకు దేశానికి కాపలా కాస్తున్న జవాను. ఒకరు ఆకలి తీర్చితే… మరొకరు భద్రత కల్పిస్తున్నారు. దేశానికి ఇద్దరూ వెన్నెముకలే” అంటూ జవాన్ల సేవలను, రైతుల కష్టాన్ని సమానంగా కొనియాడారు. గ్రామస్థులు కూడా జి. శ్రీకాంత్ కుటుంబాన్ని ఘనంగా అభినందించారు. తమ గ్రామం నుంచి దేశ రక్షణలో సేవలందిస్తున్న యువకుడు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. రైతు కుటుంబాల నుంచి దేశభక్తి స్ఫూర్తి వెలువడటం యువతకు మార్గదర్శకమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద టి. నాగేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు జి. మల్లికార్జునరావు, వేతన కార్యదర్శి జె. వెంకటేశ్వరరావు, పాడి రైతులు గ్రామస్థులు పాల్గొన్నారు.
