మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

  • ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
  • స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి
  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి, ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు ఆర్థిక అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

200 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజార్ నగర్‌లో బుధవారం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం కింద మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళలు స్వయం ఉపాధి పొందేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి 275 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రతి అర్హురాలికి కుట్టు మిషన్ అందజేస్తామని, తొలి విడతలో 200 మందికి పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

మైనారిటీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీతో పాటు జిల్లాలో 50 మసీదుల నిర్మాణానికి ఒక్కో మసీదుకు రూ.30 వేల చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. అద్దె భవనంలో కొనసాగుతున్న మైనారిటీ గురుకులాన్ని పాత జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనానికి మార్చామని, ప్రస్తుతం అక్కడ 402 మంది మైనారిటీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వివరించారు.

ప్రతి అర్హ మహిళకు సంక్షేమ ఫలాలు అందిస్తాం: కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లాలోని ప్రతి అర్హ మైనారిటీ మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కుట్టు మిషన్లను ఉపాధి సాధనంగా మలుచుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

వసతి గృహంలో విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చట

కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ మైనారిటీ వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థుల యోగక్షేమాలు, వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి సాయంత్రం అల్పాహారం స్వీకరించి, మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా, చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ కుమారస్వామి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.