టెన్షన్ వద్దు…

టెన్షన్ వద్దు…

ప్రశాంతంగా రాయండి… ఉత్తీర్ణత సాధించండి
ఇంటర్, టెంత్ సప్లి విద్యార్థులకు కలెక్టర్ సూచన..

గుంటూరు బ్యూరో / ఆంధ్రప్రభ: సోమవారం నుండి ప్రారంభం కానున్న సప్లిమెంటరీ పదవ తరగతి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు అందరూ పరీక్షలను ప్రశాంతంగా రాయండి… ఉత్తీర్ణత సాధించండి అంటూ జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, అప్పుడే పరీక్షలు బాగా రాయగలరని సూచించారు. పరీక్షలు రాస్తున్న 3 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని ఆకాక్షించారు. పదవ తరగతి పరీక్షలు జీవితంలో కీలకమని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అందుకే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పదవ తరగతి తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు తరగతులు ఏర్పాటు చేశారని అన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి శ్రమించారని, తల్లిదండ్రులు పిల్లల ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్నారని, పరీక్షలు బాగా రాసి విజయదుందుభి మోగించి కానుకగా అందించాలని, వారి కళ్ళల్లో ఆనందం చూడాలని కోరారు. పదవ తరగతి పరీక్షలు బాగా రాసి ఉన్నత విద్యను అందుకోవాలని జీవితంలో ఉత్తమ స్థానంలో నిలిచి సమాజానికి సహాయం చేసే స్థాయిలో ఉండాలని స్ఫూర్తిని నింపారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన ఎంతో మంది జీవితంలో ఉన్నత స్థానాలు సాధించారని ప్రేరణ కల్పించారు.

పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉదయం లేచి పరీక్షలకు వెళ్లి ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. 18 పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్ పదవ తరగతి విద్యార్థులతో పాటు, ఓపెన్ స్కూలింగ్
ఇంటర్మీడియట్, పదవ తరగతి విద్యార్థులు రాయడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుటకు ఆర్.టి.సి బస్సులు వేశారని,
పరీక్ష కేంద్రాల్లో ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్తు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉందని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ తో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచడం జరిగిందని చెప్పారు. వేసవి తీవ్రత రీత్యా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply