డీపీఆర్వో సంపత్ కుమార్ సేవలు అభినందనీయం
అబ్దుల్ రహమాన్
ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) సంపత్ కుమార్ జర్నలిస్టులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు.
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆసిఫాబాద్ జిల్లా నుంచి డీపీఆర్వో సంపత్ కుమార్ ఎంపికై హాజరైన సందర్భంగా బుధవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లాగా భావించే ఆసిఫాబాద్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ సదస్సుకు సంపత్ కుమార్ హాజరు కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తూ, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా చొరవ చూపుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం, పాలకులు, మీడియా మధ్య వారధిగా ఉంటూ సమాచారాన్ని వేగంగా చేరవేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు ప్రకాష్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. వేణుగోపాల్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, సంయుక్త కార్యదర్శి దేవునూరి రమేష్, ప్రెస్ క్లబ్ కోశాధికారి శ్రీధర్, జిల్లా నాయకులు నగరాజు, సురేష్ చారి, రాధాకృష్ణ చారి, రాజు, జానకిరామ్, నితీష్, మోహన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
