ఓజీజీహెచ్లో ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాల సేవలపై సమీక్ష
ఓజీజీహెచ్లో ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాల సేవలపై సమీక్ష
గర్భిణీలకు హెచ్ఐవీ నిరోధక సేవలను మరింత బలోపేతం చేయాలని సూచన
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం ప్రాజెక్టు డైరెక్టర్ బాచు స్మరణ్ రాజ్ ఈరోజు విజయవాడ పాత ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (ఓజీజీహెచ్)లోని ఏఆర్టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ), ఐసీటీసీ (ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్) కేంద్రాలను సందర్శించి సేవల అమలును సమీక్షించారు. ఈ పర్యటనలో కె. శ్రీనివాస్ వర్మ, ఎస్.ఎస్. చక్రవర్తి పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ఎస్ఓసీహెచ్ (సామాజిక ఆన్లైన్ కేస్ హిస్టరీ) పోర్టల్లో నమోదవుతున్న వివరాలు, రోగుల రికార్డులు పరిశీలించారు.
ఐసీటీసీ, ఏఆర్టీ కేంద్రాల్లో పనిచేస్తున్న కౌన్సిలర్లు, డేటా నిర్వహకులు, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, వైద్య అధికారులతో సమావేశమై సేవల నాణ్యత, పనితీరు గురించి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న హెచ్ఐవీ కౌన్సెలింగ్, పరీక్షలు, ఏఆర్టీ చికిత్సకు రిఫరల్ విధానం, రోగుల సంఖ్య సేవల వినియోగంపై ప్రత్యేకంగా సమీక్షించారు. తల్లి నుంచి శిశువుకు హెచ్ఐవీ సంక్రమణను నివారించేందుకు సకాలంలో పరీక్షలు, కౌన్సెలింగ్, చికిత్స అందించాలని సూచించారు.
అనంతరం విజయవాడ భవానీపురంలో ఉన్న ఏపీఎస్ఏసీఎస్ కేంద్ర గిడ్డంగిని సందర్శించి హెచ్ఐవీ నిరోధక, చికిత్సా కార్యక్రమాలకు అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, ఇతర సామగ్రి నిల్వలను పరిశీలించారు. రాష్ట్రంలోని 13 క్లస్టర్లకు సరఫరా అవుతున్న నిల్వల లభ్యత, పంపిణీ విధానాన్ని సమీక్షించారు. అవసరమైన సామగ్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అన్ని ఆరోగ్య కేంద్రాలకు నిరంతర సరఫరా జరిగేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని సంబంధిత అధికారులను ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు.
