పెద్ద హరిజన వాడలో విషాదం..

పెద్ద హరిజన వాడలో విషాదం..

వడదెబ్బతో యువకుడు మృతి

జూలూరుపాడు, ఆంధ్రప్రభ:
వడదెబ్బ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పెద్ద హరిజన వాడకు చెందిన ఇస్నపల్లి కృష్ణ (30) మృతి చెందాడు. బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 25న తన కుమార్తె శుభకార్యాల నిమిత్తం కృష్ణ వారం రోజుల పాటు ఎండలో తిరిగారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురవడంతో తొలుత జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

సన్ స్ట్రోక్ లక్షణాలతో వచ్చిన కృష్ణకు అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బుధవారం పిహెచ్సిని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం ఆయనను పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

అంబులెన్స్‌లో కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఇటీవలే ఇంట్లో శుభకార్యం నిర్వహించిన కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో పెద్ద హరిజన వాడలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Leave a Reply