హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన నేడు ఆ పార్టీ ఎంఎల్ఏ, ఎం ఎల్ సి లతో నేడు సమావేశం జరగనుంది తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నారు.
అలాగే.. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవడంపై క్లారిటీ రానుంది. కాగా.. ఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా.. గత బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. దీంతో.. కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధించారు. ఈ క్రమంలో.. ఈసారి జరగనున్న సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
కాగా..రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలు ఈనెల 27 వరకు జరగనున్నాయి.