సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అక్షాన్స్ యాదవ్
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్స్ యాదవ్ సూచించారు. మంగళవారం నారాయణపురం పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు సక్రమంగా జరుగుతున్నాయా అనే అంశాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, నిర్వహణను తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్‌లో క్రమశిక్షణతో పాటు రికార్డుల సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వర స్పందన చూపుతూ ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్‌ను అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఆన్‌లైన్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ తనిఖీలో సీఐ సతీష్ రెడ్డి, ఎస్‌ఐ పాండు తదితరులు పాల్గొన్నారు.
