AP CM | బాధితులకు అండగా నిలుస్తాం: సీఎం చంద్రబాబు

AP CM | బాధితులకు అండగా నిలుస్తాం: సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం ట్వీట్‌
మ‌త్తు ప‌దార్థాల అక్రమ రవాణాను స‌హించం
వ్యసన విముక్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ

AP CM | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతతో ఉంద‌ని పునరుద్ఘాటించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చేసే పోరాటం అనేది యువత భవిష్యత్తు, వారి ఆరోగ్యం, ఆశయాలను కాపాడే పోరాటమని పేర్కొంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అదే సమయంలో మాదకద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్న వారిని సమాజంలో తిరిగి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేయడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు. వ్యసన విముక్తి కోసం వారికి అవసరమైన సహాయం, పునరావాసం, పునర్నిర్మాణ అవకాశాలను కల్పించేందుకు అన్ని విధాలా మద్దతు అందిస్తామని వెల్లడించారు.

గతంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాలు పాతుకుపోయేందుకు అవకాశం ఉన్న రోజులు ముగిశాయని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సున్నా సహనం పాటించే రాష్ట్రంగా నిలుస్తోందని, వ్యసన విముక్తి కోరుకునే వారికి ఆశాకిరణంగా మారుతోందని అన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.