incident | భార్యను చంపి భర్త ఆత్మహత్య..!

incident | భార్యను చంపి భర్త ఆత్మహత్య..!
incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండల పరిధిలోని మండెపల్లి గ్రామంలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం… జిల్లెట్ల గ్రామానికి చెందిన మహ్మద్ షర్ఫొద్దీన్ (60), మండెపల్లికి చెందిన షాహిన్ (55) దంపతులు. సుమారు 40ఏళ్ల క్రితం వీరిద్దరికీ వివాహం కాగా, షర్ఫొద్దీన్ ఇల్లరికంగా మండెపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు కిటికీలో నుంచి చూడగా ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమికంగా షాహిన్‌ను హత్య చేసిన అనంతరం షర్ఫొద్దీన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు గల అసలు కారణాలు, దంపతుల మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
