IND vs AUS | పోరాడి ఓడిన భారత్ !!
మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025కు ముందు టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో జరిగిన మూడో వన్డేలో భారత్ 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 2-1తో సొంతం చేసుకుంది. ఈ హైస్కోరింగ్ పోరులో స్మృతి మంధాన చేసిన అద్భుత శతకం వృథా అయ్యింది.
భారత్ విజయానికి దగ్గరగా వెళ్లిన సమయంలో వరుస వికెట్లు పడిపోవడం ఆటను ఆసీస్ వైపు తిప్పింది. 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 125 పరుగులు చేసిన స్మృతి మంధాన ఇన్నింగ్స్ భారత్‌కు బలాన్నిచ్చినా, మరో ఎండ్ లో సహచరుల వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఓటమి తప్పలేదు.
ఆసీస్ భారీ స్కోర్
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 412 పరుగులు నమోదు చేసింది. బెత్ మూనీ (138), జార్జియో వోల్ (81), ఎలీస్ పెర్రీ (68) లతో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (3/88), రేణుకా సింగ్ (2/79), దీప్తి శర్మ (2/75) కాస్త మెరుపులు చూపారు.
ఛేజింగ్ ప్రారంభించిన భారత్.. 47 ఓవర్లలో 369 పరుగులకే ఆలౌటైంది. మంధాన సెంచరీతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52), దీప్తి శర్మ (72) అర్ధశతకాలు సాధించినా విజయం అందుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్ (3/69), మేగన్ స్కట్ (2/53) వికెట్లు తీశారు.
ఈ సిరీస్‌లో భారత్ పోరాటం చేసినా, కీలక సందర్భాల్లో ఒత్తిడికి లోనై విజయాన్ని చేజార్చుకుంది. ఇక సెప్టెంబర్ 30 నుంచి శ్రీలంక-భారత్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో ఈ లోపాలను సరిచేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
