చెవిలో పువ్వులతో వినూత్న నిరసన..

దండేపల్లి, ఆంధ్రప్రభ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ వీఓఏలు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఐకేపీ, సెర్ప్ వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు.
మండలంలోని ఐకేపీ వీఓఏల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ఈ సందర్భంగా ఐకేపీ వీఓఏల యూనియన్ మండల అధ్యక్షుడు బద్రి సత్తన్న మాట్లాడుతూ, పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని వీఓఏలకు నెలకు రూ.20 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, రూ.10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అర్హులైన వీఓఏలకు కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా (సీసీలు) పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కొప్పుల లింగయ్య, ప్రధాన కార్యదర్శి ప్రమీల, కోశాధికారి శ్రీమతి, ఉపాధ్యక్షుడు ముత్యం శ్రీనివాస్, సలహాదారులు బొలిశెట్టి అనంతలక్ష్మి, మహేష్, భూలక్ష్మి, నీరజ, అడే సుజాత, విజయ, రవి, రజిత, మంగ, సరిత తదితరులు పాల్గొన్నారు.
