హామీల అమలుకు పట్టుబట్టిన ఉద్యోగులు..

రుద్రూర్, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) వీఓఏలు సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీఓఏల సంఘం రుద్రూర్ మండల అధ్యక్షురాలు జరీనా మాట్లాడుతూ, వీఓఏలకు కనీస వేతనంగా రూ.26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. వారిని స్వయం ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు.
అర్హులైన వీఓఏలను కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా గుర్తించాలని, జీఓ 58ను సవరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
అర్హులైన వీఓఏలను సీసీలుగా గుర్తించాలని, విధుల నిర్వహణకు అవసరమైన ట్యాబ్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 5జీ సేవలకు సంబంధించిన నిబంధనలను కూడా సవరించాలని కోరారు.
తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ నిరవధిక సమ్మెలో జరీనా, సాయిబాబా, గంగారం లావణ్య తదితరులు పాల్గొన్నారు.
