సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన…

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన…

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
నెల్లూరు జిల్లాను తీర్చి దిద్దుతామని వెల్లడించిన సీయం

వింజమూరు(నెల్లూరు), ఆంధ్ర‌ప్ర‌భ : సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ ప్రతీ నెల మొదటి తేదీన పేదల సేవలో ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా పేదల సేవలోనే ఉంటున్నామన్నారు. రూ.2,750 కోట్లను ప్రతీ నెల పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్న ప్రభుత్వం ఏపీనే అన్నారు.

పొరుగున తమిళనాడులో కేవలం రూ.1000 మాత్రమే పెన్షన్ గా ఇస్తున్నారని, ప్రజలపై ఉన్న అభిమానంతోనే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని చేయగలుగుతున్నామన్నారు. గత ఏడాది తల్లికి వందనం కింద ఆర్ధిక సహకారం అందించామన్న సీయం, మళ్లీ జూన్ లో ఆడబిడ్డల ఖాతాల్లో ఈ నిధులు వేస్తామన్నారు. దీపం 2.0 కింద మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నామని,. త్వరలో పైప్ ద్వారానూ గ్యాస్ ఇంటింటికీ అందిస్తామన్నారు.

ఏడాదికి రూ.2400 లను సబ్సీడీగా ఇస్తామన్నారు. పోలవరానికి రూ.1300 కోట్లను కేంద్రం అడ్వాన్స్‌గా ఇచ్చిందని, గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. పేదవాళ్ల జీవన ప్రమాణాలు పెరిగేలా పీ4 కార్యక్రమాన్నిసుకువచ్చామన్నారు.25 వేల కుటుంబాలను దత్తత తీసుకోవడానికి అదానీ ట్రస్ట్ కూడా ముందుకు వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని రామాయపట్నం, దుగరాజపట్నం లాంటి పోర్టులు వస్తాయన్నారు.

రక్షణ పరికరాల ఉత్పత్తి, ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ తయారీ సహా, ఉదయగిరిలో మానవ రహిత విమానాలు, డ్రోన్ల తయారీకి కొత్త పరిశ్రమ వస్తోందన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ ఉందన్నారు. ఇందులో నెల్లూరు జిల్లా ఉదయగిరి కూడా కీలకంగా మారిందన్నారు. ఇఫ్కో సెజ్ ద్వారా 80 వేల మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. సోలార్ సెల్స్ ఉత్పత్తి కూడా జరిగే అవకాశం ఉందన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

కృష్ణపట్నం పోర్టును వాణిజ్యపరంగా మార్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదన్నారు. 2018-19లో కేంద్రానికి లేఖ రాసి జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశామన్నారు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ మత్స్యకారులకు అన్యాయం చేసే పరిస్థితి ఉండదు, ఉండబోదన్నారు. తమిళనాడు నుంచి వస్తున్న మత్స్యకారులు ఎవరూ మన జలాల్లో చేపల వేట చేయకుండా నిఘా పెడతామన్నారు. ఏపీ జలాల్లోకి వచ్చి ఇక్కడి మత్స్యకారులను ఇబ్బంది పెట్టవద్దని తమిళనాడు వారికి చెబుతున్నామన్నారు. మన జలాల్లో తమిళనాడు మత్స్యకారులు వేట చేయకుండా చూడాలని నెల్లూరు, తిరుపతి కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నానన్నారు.

సుపరిపాలన ఇచ్చేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఈ సందర్భగా చెప్పిన సీయం.. ప్రభుత్వం అందించే సేవలపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సేవలు సరిగా అందకపోయినా, మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. సుపరిపాలన అనే మహాయజ్ఞానికి ఎవరు నష్టం కలిగించినా సహించబోనని ఈ సందర్భంగా సీయం స్పష్టం చేసారు.

Leave a Reply