మంచినీళ్ల కోసం వచ్చిన విద్యార్థులపై పీఈటీ దాష్టికం..

  • 40 మందిపై విచక్షణారహిత దాడి! స్కూల్ వద్ద ఉద్రిక్తత

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో దప్పిక తీర్చుకోవడానికి మంచినీళ్ల కోసం వచ్చిన విద్యార్థులపై ఒక పీటీ (PET) టీచ‌ర్ రాక్షసంగా ప్రవర్తించాడు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను పశువుల వలె కర్రలతో విచక్షణారహితంగా చితకబాదిన ఘోర సంఘటన విజయవాడ లాల్ బహుదూర్ శాస్త్రి నగర్ ప్రాంతంలోని శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ హైస్కూల్లో సోమవారం చోటుచేసుకుంది.

ఊహించని దాడి.. విద్యార్థుల ఆక్రందనలు

పాఠశాలకు చెందిన పీటీ మాస్టర్ రవీంద్ర రెడ్డి, విద్యార్థులు చేసిన తప్పు ఏంటో కూడా చెప్పకుండానే ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. సుమారు 40 మంది విద్యార్థులను చితకబాదగా.. వారిలో 20 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పీటీ మాస్టర్ బారిన పడిన విద్యార్థుల ఆక్రందనలతో పాఠశాల ప్రాంగణం మిన్నంటింది. దెబ్బలు తిన్న పిల్లల ఒంటిపై వాతలు చూసి తోటి విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు.

తల్లిదండ్రుల ఆగ్రహం.. స్కూల్ వద్ద ఉద్రిక్తత

తమ పిల్లలపై పీటీ మాస్టర్ విచక్షణారహితంగా దాడి చేశాడన్న వార్త తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఉపాధ్యాయుడి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న నున్న, సింగ్ నగర్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసి, నిందితుడైన పీటీ మాస్టర్ రవీంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

బాత్రూమ్‌లు ఈగల మోత.. మెయింటెనెన్స్ శూన్యం!

ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. స్కూల్లో కనీస సౌకర్యాలు లేవని, ముఖ్యంగా విద్యార్థులు వాడే బాత్రూమ్‌లు అత్యంత అధ్వానంగా ఉండి ఈగలు తాండవిస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులకు నరకం లాంటి బాత్రూమ్‌లు ఉంచి, ఉపాధ్యాయులకు మాత్రం ప్రత్యేకంగా శుభ్రమైన బాత్రూమ్‌లు వాడుతున్నారని అధికారుల ఎదుట వాపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యాశాఖ డివిజనల్ అధికారి (DYEO) సాంబశివరావు విచారణ జరిపి, సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపాటు

విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాఠశాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గురువు స్థానంలో ఉండి పిల్లలపై రాక్షసంగా దాడి చేయడం దుర్మార్గమన్నారు. రవీంద్ర రెడ్డిని తక్షణమే విధుల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణ కరువైందని విమర్శించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని కూటమి పాలకులు పూర్తిగా నాశనం చేశారని, కనీసం స్కూల్ మెయింటెనెన్స్ కూడా పట్టించుకోవడం లేదని మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.