POLITICS | అదే జరిగితే.. తరిమికొడతాం..

POLITICS | నల్గొండ, ఆంధ్ర ప్రభ : గాంధీ భవనం చుట్టూ తిరిగితే ఎప్పుడో నాకు పదవులు వచ్చేవి అని కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియార్టీ ఎందుకు పనికిరాదని.. 22 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పని చేశానని, అలాగే గత పది సంవత్సరాలలో పార్టీని కష్టపడి నియోజకవర్గంలో నిలబెట్టామని గుర్తు చేశారు.

డీసీసీ పదవి అడిగిన ప్రతి సందర్భంలో కోమటిరెడ్డి అనుచరుడని, నా కులం అడ్డు వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకుండా డీసీసీ పదవి చేపట్టవచ్చని స్పష్టంగా రుజువైంది. ఎవరిని ఒప్పించకుండా రాజకీయాలు చేస్తే.. పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా జెండా విడవకుండా పార్టీ కోసం నిబద్ధతతో పని చేశానని అన్నారు. మునుగోడు బైబిల్ ఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నేను సపోర్ట్ చేయలేదని, నాటి కాంగ్రెస్ అభ్యర్థికి సిన్సియర్ గా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలకు ఎంపీ పదవులు వచ్చాయని అన్నారు. పార్టీలో ఎవరి వెంట తిరిగితే వాళ్ల బ్యాచ్ అంటున్నారు. ఇది సరైనది కాదని అన్నారు. తాను కూడా రేవంత్ వెంట తిరిగితే ఎమ్మెల్యే, ఎంపీ పదవులు వచ్చేదని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయను. దేవుడు లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డినే నమ్ముకున్న, ఆయనే న్యాయం చేస్తాడని భావిస్తున్నానని అన్నారు.

జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తలుచుకుంటే తనకు 24 గంటల్లో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చి తీరుతుందని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా కార్పొరేషన్ పదవి దక్కలేదని, ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించాలని కోరారు. నూతనంగా జిల్లా పుణ్య కైలాస నేతకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే కార్యకర్తలను మర్చిపోవద్దని, పార్టీ పేరు చెప్పుకొని పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు, సమాచార హక్కు చట్టం దరఖాస్తులు వేస్తూ, పార్టీలకు లొంగిపోయే కార్యకర్తల నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ అదే జరిగితే నల్గొండ నియోజకవర్గంలో తరిమికొడతామని హెచ్చరించారు. ఈ విధంగా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.