IAS Study Circles | మరో మూడు చోట్ల బీసీ ఐఎఎస్ స్టడీ సర్కిళ్లు…

IAS Study Circles | మరో మూడు చోట్ల బీసీ ఐఎఎస్ స్టడీ సర్కిళ్లు…
- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
- అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం
- బీసీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యం : మంత్రి సవిత
IAS Study Circles | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మరో మూడు చోట్ల బీసీ ఐఎఎస్ స్టడీ సర్కిళ్లు(IAS Study Circles) ఏర్పాటు చేయనున్నామని, వాటి ద్వారా సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందజేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అమరావతిలో అయిదెకరాల్లో రాష్ట్ర స్థాయి బీసీ స్టడీ సర్కిల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు.
విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ కార్పొరేషన్(BC Corporation) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సివిల్స్ కోచింగ్ సెంటర్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత కోచింగ్ పొందుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. విద్యా బోధన, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోని కీలక స్థానాల్లో బీసీలు ఉండాలన్నది ఆయన ఆకాంక్ష అని అన్నారు.

ఈ నేపథ్యంలో నిరుద్యోగ బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలు ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు. గతేడాది మంది అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్(Civils Coaching) అందజేశామన్నారు. మెగా డీఎస్సీని దృష్టిలో పెట్టుకుని, సుమారు అయిదు వేల మందికి శిక్షణ అందివ్వగా, వారిలో 281 మంది టీచర్ పోస్టులు సాధించారన్నారు.
ఈ ఏడాది కూడా ఉచిత సివిల్స్ కోచింగ్ ప్రారంభించామని, 100 మంది అభ్యర్థులకు నాణ్యమైన ఆహారం, వసతులతో కూడిన విద్య అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని, బీసీ అభ్యర్థులు సివిల్స్ పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో కొత్తగా మరో మూడు చోట్ల బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి, సివిల్ సర్వీసెస్ లో ఉచిత కోచింగ్ అందివ్వనున్నట్లు మంత్రి సవిత(Minister Savita) తెలిపారు. అమరావతిలో అయిదు ఎకరాల్లో రాష్ట్ర స్థాయి బీసీ స్టడీ సర్కిల్ నిర్మించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారులు భీమశంకర్, తానూజరాణి తదితరులు పాల్గొన్నారు.
IAS Study Circles |అవకాశం సద్వినియోగం చేసుకుంటా..

ఢిల్లీకి వెళ్లి రూ.5 లక్షలు వెచ్చించి సివిల్స్ కోచింగ్ తీసుకున్న ఇటువంటి సౌకర్యాలు, వసతి దొరకవు. ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులతో బోధన, ప్రోటీన్ తో కూడిన ఆహారం అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం(Protsatham)మరువలేనిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. … లావణ్య, విజయనగరం
IAS Study Circles |గ్రామీణులకు ఎంతో మేలు..

సివిల్స్ కోచింగ్ ఎంతో ఆర్థికభారమైనది. గ్రామీణ ప్రాంతాల యువతకు సాధ్యం కానిది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సివిల్స్ కోచింగ్ పేద, మధ్య తరగతి బీసీ అభ్యర్థులకు ఎంతో మేలు కలుగుజేస్తోంది. ఐఎఎస్(IAS) కావాలన్న కల ఉచిత కోచింగ్ తో నెరవేర్చుకుంటాం. ఎంత ఖర్చుచేసినా ప్రభుత్వం అందిస్తున్న సేవల కంటే మిన్నగా ఉండవు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.
CLICK HERE TO READ MORE : Governor | మరిన్ని అత్యున్నత శిఖరాలను అధిరోహించండి..
