HYDRA Hyderabad | చెరువుల కబ్జాలపై హైడ్రా సీరియస్ చర్యలు

HYDRA Hyderabad | చెరువుల కబ్జాలపై హైడ్రా సీరియస్ చర్యలు

HYDRA Hyderabad | మాదాపూర్ ఈదులకుంటను కాపాడిన హైడ్రా
కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
కోకాపేట కొత్త చెరువులో ఆక్రమణల తొలగింపు

HYDRA Hyderabad | హైదరాబాద్, ఆంధ్రప్రభ: చెరువుల కబ్జాలను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. మంగళవారం ఒకే రోజు రెండు చెరువులను హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లో కబ్జాదారులు మాయం చేసిన 6.05 ఎకరాల ఈదులకుంట జాడను కనిపెట్టింది. ఆ పక్కనే ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించింది.

అలాగే గండిపేట మండలంలోని కోకాపేట గ్రామంలోని కొత్త చెరువు మధ్యలోంచి బండ్ నిర్మించి ఎగువ ప్రాంతాన్ని కబ్జా చేయాలనే రియల్టర్ల ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. కొత్త చెరువులో మొత్తం 22 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. రెండు చోట్ల హైడ్రా ఫెన్సింగ్ వేసి దాదాపు రూ. 4 వేల కోట్ల విలువైన భూమి కబ్జాల పాలవ్వకుండా హైడ్రా రక్షించింది. స్థానికుల ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖలతో పరిశీలించి చెరువుల కబ్జాలను హైడ్రా అధికారులు నిర్ధారించుకున్నారు.

ఈదులకుంటను కాపాడిన హైడ్రా

ఐటీ కారిడార్‌లోని మాధాపూర్‌లో చెరువును మాయం చేయాలనే కబ్జాదారుల ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్ సర్వే నంబరు 7లో ఉన్న 6.05 ఎకరాల ఈదులకుంటను కబ్జాల చెర నుంచి విడిపించింది.

శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట నిండితే వరద కాలువ ద్వారా ఈదులకుంటకు నీరు చేరేది. ఆ కాలువను డైవర్ట్ చేయడంతో ఈదులకుంటకు వరద నీరు చేరకుండా చేశారు. చెరువు రూపురేఖలు మార్చేసి, హద్దులు చెరిపేసి, ఇక భవన నిర్మాణాలే ఆలస్యం అనుకున్న తరుణంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.

తమ్మిడికుంట, ఈదులకుంట, సున్నం చెరువులుగా గొలుసుకట్టుగా ఉన్న వాటిలో ఈదులకుంట మాయమవుతోందని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కేసు నమోదు చేసింది. స్థానికుల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రాకు అక్కడ చెరువు ఆనవాళ్లు కనిపించాయి. గ్రామ, రెవెన్యూ రికార్డుల మేరకు 6.05 ఎకరాల చెరువున్నట్టు నిర్ధారించుకుంది. ఇదే విషయాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాలు కూడా నిర్ధారించాయి.

దీంతో మంగళవారం చెరువు హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేసింది. 6.05 ఎకరాల ఈదులకుంటకు తోడు.. ఆ పక్కనే సర్వే నంబరు 11/37లో ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. మొత్తం 11.21 ఎకరాల భూమిని కాపాడినట్టైంది. ఇలా మొత్తం మాదాపూర్‌లోనే దాదాపు రూ. 1800 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి చుట్టూ హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేస్తోంది.

ఓవర్‌ల్యాపింగ్ పేరిట కొట్టేసే ప్రయత్నం

రెండు మండలాల సరిహద్దుల్లో ఉండడం కబ్జాదారులకు ఈదులకుంటతో పాటు.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి వరంగా మారింది. కూకట్‌పల్లి మండలం కూకట్‌పల్లి గ్రామంలో చెరువులేదంటూ కబ్జాదారులు చూపించారు. ఇదే సమయంలో శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లో 6.05 ఎకరాల చెరువు ఉంది.

ఒకవేళ ఓవర్‌ల్యాప్ అయినా.. చెరువును ఎవరూ మార్చలేరు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో ఇరు మండలాల అధికారులు చొరవ చూపాలి. అది జాప్యం జరగడంతో ఇదే అదనుగా ఎన్పీఎన్ కనస్ట్రక్షన్స్ కంపెనీ చేతివాటం చూపించింది. ఇదే అదనుగా 6.05 ఎకరాల చెరువుతో పాటు.. సర్వే నంబరు 11/37లో ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి నిర్మాణాలకు సిద్ధమయ్యారు.

కూకట్‌పల్లి మండలం పరిధిలోకి వచ్చే సర్వే నంబరు 1003 నుంచి 1006 వరకు ఉన్న భూమిని చూపించి 14 అంతస్తుల భవన నిర్మాణానికి సదరు సంస్థ 2022లో అనుమతులు తీసుకుంది. తప్పుడు పత్రాలతో ఇరిగేషన్ అనుమతులు కూడా ఇదే ఏడాది సదరు నిర్మాణ సంస్థ తీసుకుంది. అయితే నిర్మాణాలు మాత్రం 6.05 ఎకరాల ఈదులకుంటలో చేపడుతున్నారు. ఈ మేరకు సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

ఇదే విషయమై స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారించారు. 6.05 ఎకరాల చెరువు స్థలంతో పాటు.. 5.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు మొత్తం 11.21 ఎకరాల భూమిని కాపాడుతూ మంగళవారం ఫెన్సింగ్ వేశారు.

కోకాపేట కొత్త చెరువుకు హైడ్రా ఫెన్సింగ్

ఐటీ సెజ్‌లకు చేరువలోని కోకాపేటలో కొత్త చెరువు కబ్జాలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి 72 ఎకరాలు. అభివృద్ధి మాటున చెరువు మధ్యలోంచి కట్ట కట్టి ఎగువున ఉన్న 20 ఎకరాలకు పైగా ఉన్న భూమిని కొంతమంది రియల్టర్లు కబ్జా చేశారు. ఫెన్సింగ్‌లు వేసి కొందరు, రేకుల ప్రహరీలతో మరికొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. వీరి కబ్జాలకు చెరువు మధ్యలో నిర్మించిన కట్ట ఆసరాగా మారింది.

మరోవైపు గోల్డ్ ఫిష్ విల్లాలను నిర్మించిన రియల్టర్ కబ్జాలకు పాల్పడ్డాడు. తన పరిధి వరకు విల్లాలు నిర్మించి ఓపెన్ ఏరియాగా చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని వినియోగించేశాడు. చెరువులో మట్టి పోసి ఏకంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులను నిర్మించాడు. పిల్లల ప్లే ఏరియాను కూడా చెరువు పరిధిలోనే ఏర్పాటు చేశాడు.

ఇలా 1.09 ఎకరాల మేర చెరువును ఆక్రమించేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా మంగళవారం తొలగించింది. చెరువు హద్దులను నిర్ధారించి.. ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసింది. అలాగే చెరువు ఎగువ భాగంలో కూడా 20 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించి హద్దులు నిర్ణయించింది. భవిష్యత్తులో కబ్జాలకు అవకాశం లేకుండా హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఇలా రూ. 2200 కోట్ల రూపాయల విలువైన భూమిని హైడ్రా కాపాడింది.

Leave a Reply