Telangana Water Crisis | తీవ్రమవుతున్న తాగునీటి సంక్షోభం

Telangana Water Crisis | తీవ్రమవుతున్న తాగునీటి సంక్షోభం
Telangana Water Crisis | ట్యాంకర్లపై ఆధారపడుతున్న హైదరాబాద్ ప్రజలు
భూగర్భ జలాల పతనంతో పెరుగుతున్న ఆందోళన
మల్లన్నసాగర్‌పై ప్రభుత్వం భారీ ఆశలు
Telangana Water Crisis | హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో: మండుటెండలతో రాష్ట్రం అల్లాడిపోతోంది. అన్ని వర్గాల ప్రజలను తాగునీటి ఘోష వెంటాడుతోంది. హైదరాబాద్ నగరంలో అడుగంటిన భూగర్భ జలాలతో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గడిచిన 20 రోజుల్లొనే 2.60 లక్షల వాటర్ ట్యాంకర్ల సరఫరా జరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. ఇదే అదనుగా ప్రైవేటుగా నీటి వ్యాపారుల దందా పెచ్చుమీరిపోతోంది. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నగరంలో తాగునీటి అవసరాల కోసం జలమండలి వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే వారి సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయింది. వారం రోజులుగా రోజుకు సగటున 12 వేలకు పైగా ట్యాంకర్లు నగర వీధుల్లో పరుగులు తీస్తున్నాయి.
మే నెలలోనే ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్
సాధారణంగా హైదరాబాద్ నగరంలో ఏటా ఏప్రిల్ నెలలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉంటుంది. మే నెలలో అడపాదడపా కురిసే వర్షాల వల్ల డిమాండ్ కొంత తగ్గుముఖం పట్టేది. ఈ ఏడాది ఏప్రిల్ కంటే మే నెలలోనే డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాది (2025) మే నెల మొత్తం మీద జలమండలి ద్వారా కేవలం 1.69 లక్షల ట్యాంకర్ల సరఫరా మాత్రమే జరగ్గా, ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి 2.60 లక్షల మార్కుకు చేరుకోవడం గమనార్హం. ఇక ప్రైవేటు ట్యాంకర్లకు లెక్కే లేదు.
మిషన్ భగీరథ పంపింగ్ హౌస్ వద్ద నెలకొన్న సమస్యలతోపాటు విద్యుత్తు ప్రాబ్లమ్స్‌తో నీటి సరఫరా అంతంత మాత్రంగానే జరుగుతోంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను పంపింగ్ హౌస్‌ల ద్వారా జిల్లాకు సరఫరా చేస్తుండగా మొదటి పంపింగ్ హౌస్‌లో సమస్యలు తలెత్తితే జిల్లాకు నీటి సరఫరా ఆగిపోతుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
మోగుతున్న ప్రమాద ఘంటికలు
రాజధాని నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ నీటి మట్టాలు ప్రజలకు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఇప్పటికే బోర్ల నుంచి నీరు బయటకు రాక పంటలు ఎండుతున్నాయి. జనసాంద్రత ఎక్కువ ఉన్న శేరిలింగంపల్లి వంటి మండలాల్లో నీటి మట్టాలు వేగంగా తరిగిపోతున్నాయి.
వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు 130 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, నెలరోజులుగా 60-70 శాతం మాత్రమే అందిస్తున్నారు. రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తుండడంతో ప్రజలకు పానీపాట్లు మొదలయ్యాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను పంపింగ్ చేసి ఎల్లూరు, గౌరదేవిపల్లి, కరకల్పహాడ్, కమ్మదనం పంపింగ్ హౌస్‌ల నుంచి నీటిని అందిస్తున్నా.. హౌస్‌ల్లోని ఏదో ఒక పంపింగ్ హౌస్‌లో సమస్య తలెత్తితే మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
పట్టణాలే కాకుండా, పల్లెల్లోనూ తాగునీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. శేరిలింగంపల్లి మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 36.25 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. మెట్రో వాటర్ బోర్డు కూడా డిమాండ్‌కు సరిపడా తాగునీరు సరఫరా చేయలేకపోతోంది.
ఆందోళన కలిగిస్తున్న భూగర్భ నీటి మట్టాలు…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో 36.25 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇబ్రహీంపట్నంలో 20.42 మీటర్లు, తలకొండపల్లిలో 18.21 మీటర్లు, హయత్‌నగర్‌లో 17.81 మీటర్లు, చౌదరిగూడెంలో 16.76 మీటర్లు, కడ్తాల్లో 14.36 మీటర్ల మేర నీటి మట్టాలు తగ్గాయి.
షాబాద్‌లో 13.95 మీటర్లు, మంచాలలో 13.8 మీటర్లు, శంకరపల్లిలో 13.12 మీటర్లు, చేవెళ్లలో 12.66 మీటర్లు, కొత్తూరులో 12.61 మీటర్లు, మహేశ్వరం మండలంలో 12.72 మీటర్ల లోతులకు భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. కూకట్‌పల్లి మండలంలో 22.74 మీటర్ల లోతుకు జలమట్టం పడిపోయింది.
అల్వాల్లో 9.96, బాచుపల్లిలో 6.66, బాలానగర్‌లో 9.77 మీటర్లు, దుండిగల్లో 16.35, ఘట్‌కేసర్‌లో 8.56 మీటర్లు, కాప్రాలో 4.81 మీటర్లు, కీసరలో 10.24 మీటర్లు, మూడుచింతలపల్లిలో 18.13 మీటర్లు, మల్కాజిగిరిలో 16.58 మీటర్లు, మేడ్చల్‌లో 10.02 మీటర్లు, మేడిపల్లిలో 16.72 మీటర్లు, కుత్బుల్లాపూర్‌లో 11.93 మీటర్లు, శామీర్‌పేటలో 7.31, ఉప్పల్లో 13.85 మీటర్ల చొప్పున నీటి మట్టాలు పడిపోయాయి.
సింగూరుకు మరమ్మతులు
హైదరాబాద్ ప్రజలకు 50 ఏళ్లుగా తాగునీటి అవసరాలు తీరుస్తున్న సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాల్సి రావడంతో ప్రస్తుతం ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. ఏటా 7 టీఎంసీల నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీటి కోసం వాడుతున్నారు. ప్రాజెక్టు అప్‌స్ట్రీమ్ రివిట్‌మెంట్ దెబ్బతినడంతో సింగూరు ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. దీంతో రాబోయే రోజుల్లో నగరానికి తాగునీటి ఇబ్బందులు తప్పవని భావించి ముందస్తుగా.. మల్లన్నసాగర్ నీటి తరలింపు పనుల్లో వేగం పెంచారు.
సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామం నుంచి గజ్వేల్ నియోజకవర్గం సిద్దాపూర్ వరకు ప్రస్తుతం పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. మల్లన్నసాగర్ ఒకవేళ నీటి మట్టాలు తగ్గితే పైనున్న కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సైతం నీటిని వాడుకునే విధంగా మరో ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇందుకు అనుగుణంగా బాహుబలి పంపులను వాడాలని నిర్ణయించారు.
హైదరాబాద్ ఆశలన్నీ మల్లన్నసాగర్‌పైనే…
తాగునీటి ఎద్దడి సమస్యలు తీవ్రమవుతుండడంతో ప్రభుత్వం మల్లన్నసాగర్ వైపు దృష్టి సారించింది. ఇప్పటికే కృష్ణా, మంజీరా ద్వారా హైదరాబాద్ నగరానికి నీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలతో నగర దాహార్తి తీర్చడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు కల్పతరువుగా మారనుంది. 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ రాజధాని ప్రజల గొంతు తడపడానికి ఉపయోగపడబోతోంది.
జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి సుజల స్రవంతి పథకాన్ని పన్నెండేళ్ల క్రితమే రూ. 3,375 కోట్లతో పూర్తి చేశారు. ఈ పథకం కింద ఎల్లంపల్లి బ్యారేజి నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నా.. మహానగర వాసుల దాహార్తికి తిప్పలు తప్పడం లేదు.
దీంతో మల్లన్నసాగర్ మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు. రూ. 4,500 కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుని పనులు చేస్తోంది. 18 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని మెగా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
