సాగునీటి విడుదల అసాధ్యం
- 2026-27 ఖరీఫ్‌లో తాగునీటికే ప్రాధాన్యత
- సత్తెనపల్లిలో నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో స్పష్టీకరణ
సత్తెనపల్లి, ఆంధ్రప్రభ: ప్రస్తుతం ఖరీఫ్ కు సాగునీటిని ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం సత్తెనపల్లిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, సత్తెనపల్లి, నకరికల్లు సబ్-డివిజన్ల పరిధిలోని నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ ఎం. మురళీధర్, ఇతర సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. 2026–27 నీటి సంవత్సరం ఎల్-నినో ప్రభావిత సంవత్సరంగా అంచనా వేయబడినందున, కృష్ణా పరివాహక ప్రాంత జలాశయాలకు సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం, స్వల్ప జలప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న క్లిష్టమైన నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకొని, 2026–27 ఖరీఫ్ సీజన్లో నాగార్జునసాగర్ జవహర్ కాలువ పరిధిలో సాగునీరు విడుదల చేయడం సాధ్యం కాదని తెలిపారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకే అత్యంత పొదుపుగా సంరక్షించాల్సిన తక్షణ అవసరం ఉందని వివరించారు.
భవిష్యత్తులో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు త్రాగునీటి అవసరాలను మించి సమృద్ధిగా నీరు వస్తే, అప్పుడు ఖరీఫ్ పంటల సాగుపై వ్యవసాయ, జలవనరుల శాఖలు కలిసి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాయని తెలిపారు. ఈ అత్యవసర పరిస్థితిని రైతులందరూ అర్థం చేసుకుని ప్రథమ ప్రాధాన్యతగా తాగునీటి సంరక్షణకు సహకరించాలని కోరారు. నీరు లేకుండా వరి సాగు చేస్తే వర్షాలు లేక పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంటుందని రైతులు గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
