కాంగ్రెస్ అధిష్టానం త్వరలో రేవంత్ రెడ్డిని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతోందని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అసందర్భంగా ఏది పడితే అది మాట్లాడే వాడిని కాదని, తాను చెప్పింది ఎన్నడూ తప్పు కాలేదని కామెంట్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో రోజురోజుకు ముసలం ముదురుతోందని సీఎం రేవంత్ రెడ్డిపై 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలిపారు. నిన్నటి వరకు వరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా కొనసాగిన దీపాదాస్ మున్షీ ని రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారనే ఆమెను ఆ పోస్టు నుంచి తప్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధిష్టాన పెద్దలు రాష్ట్రంలోని అన్ని పరిణామాలను సైలెంట్‌గా గమనిస్తున్నారని.. త్వరలోనే రేవంత్ రెడ్డిని సీఎం పోస్టు కూడా పీకేస్తారన్నారు.
అయితే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని బ్రతిమాలుకునే ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లాడని తెలిపారు. ఏఐసీసీ పెద్దల మెప్పు కోసమే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై వరుసగా పదునైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సంచలన తీర్పు రాబోతోందని, 10నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.