పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భద్రత: అధికారులు
హన్వాడ, ఆంధ్రప్రభ: మండలంలోని కొత్తపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ఎంపీడీవో యశోదమ్మ, ఎంఈవో గోపాల్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు మండల అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో యశోదమ్మ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎంఈవో గోపాల్ నాయక్ మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడుకోవడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి మానవ మనుగడకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, గ్రామస్తులు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
