Hyderabad Fire | డెకరేషన్ గోదాంలో మంటలు

Hyderabad Fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూసీ నది సమీపంలో ఉన్న ఓ డెకరేషన్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే గోదాం అంతటా వ్యాపించాయి.

గోదాంలో ప్లాస్టిక్, థర్మకోల్, దుస్తులు వంటి సులభంగా మంటలు అంటుకునే డెకరేషన్ సామగ్రి భారీగా నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగతో పాటు భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. మంటలు సమీపంలోని ఇతర భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనాస్థలిలో భద్రతా ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను మళ్లిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.