జాతీయస్థాయిలో సింగరేణికి 5 స్టార్ రేటింగ్..
- ఐదు బొగ్గు గనులు అత్యుత్తమ గనులుగా ఎంపిక
- తెలంగాణ బొగ్గు పరిశ్రమకు అవార్డుల పంట
- గుర్తించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. సంస్థకు చెందిన 5 బొగ్గు గనులు అత్యుత్తమ బొగ్గు గనులుగా గుర్తింపును సంపాదించడంతోపాటు అవార్డులను సొంతం చేసుకుంది. కేంద్ర బొగ్గు శాఖ ప్రతీ ఏటా నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపికలో ఈ సారి సింగరేణి సంస్థ నుండి 5 గనులు 5-స్టార్ రేటింగ్ సాధించి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యాయి.
కేంద్ర బొగ్గు శాఖ విడుదల చేసిన జాబితాలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్.కె న్యూటెక్, ఆర్.కె-6, సత్తుపల్లి ఏరియా నుండి జె.వి.ఆర్ ఓసి-2, బెల్లంపల్లి ఏరియా నుండి ఖైరిగూడ ఓపెన్ కాస్టు గని, రామగుండం-3 ఏరియా నుండి ఆర్.జి ఓసి-1 గనులు అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ గనులుగా ఎంపికైనట్లుగా ప్రటించారు. దేశవ్యాప్తంగా 382 గనులు ఈ 5 స్టార్ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 50 గనులు 5 స్టార్ రేటింగ్‌కు ఎంపిక కాగా, అందులో 5 గనులు సింగరేణి నుంచి ఉండటం విశేషం. గత ఏడాది 4 గనులకు ఈ 5-స్టార్ రేటింగ్ రాగా ఈ సారి 2024-2025 సంవత్సరానికి గాను సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 5 గనులకు 5-స్టార్ రేటింగ్ లభించడం విశేషం.

ఇతర గనులకు కూడా ఈ గనులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బొగ్గు గనుల్లో ఉత్తమ పని విధానం, కార్మిక సంక్షేమం, పర్యావరణహిత చర్యలు, సమీప గ్రామాల అభివృద్ది వంటి 7 ప్రధాన విభాగాల్లో మొత్తం 50 అంశాలలో అత్యుత్తమంగా ఉంటున్న గనులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తన అనుబంధ సంస్థ అయిన కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతీ ఏడాది ఈ పోటీని నిర్వహిస్తున్నారు.
కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వారు ప్రతీ ఏటా దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల నుండి 5-స్టార్ రేటింగ్ లో పాల్గొనవల్సిందిగా ఆహ్వానం పలుకుతుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు మైనింగ్ కంపెనీలు ఈ 5-స్టార్ రేటింగ్ కోసం స్వీయ మూల్యాంకనం నిర్వహించుకుని దరఖాస్తు చేస్తుంటాయి. ఇందులో ప్రధానంగా 7 విభాగాల్లో గనుల ప్రతిభ, పని పరిస్థితులు పరిగణనలోకి తీసుకుంటారు.
ఆ గనుల్లో మైనింగ్ ఎలా నిర్వహిస్తారు? బొగ్గు తవ్వకం టెక్నాలజీని సమర్ధవంతంగా వాడుతున్నారా? గని ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? గని ప్రభావిత ప్రాంతాలలో, గ్రామాలలో సంక్షేమ చర్యలు, కార్మిక సంక్షేమ చర్యలు ఏ స్థాయిలో అమలవుతున్నాయి?, రక్షణ, కార్మికుల భద్రతకు తీసుకొంటున్న చర్యలు, పర్యావరణహిత చర్యలు వంటివి పరిశీలనకు తీసుకొంటారు.
ఈ 7 ప్రధాన విభాగాల్లో మొత్తం 50 అంశాలలో ఏ గనులు అయితే నూటికి 90 శాతం మార్కులు పై బడి సాధిస్తాయో వాటిని 5-స్టార్ (అత్యుత్తమ) గనులుగా గుర్తిస్తారు. 5-స్టార్ రేటింగ్ ఇచ్చేముందు కోల్ కంట్రోలర్ విభాగానికి చెందిన నిపుణుల బృందం ఆ గనులను సందర్శించి, ఆ గనులు ఇచ్చిన సమాచారం సరైనదేనా? కాదా? అని తనిఖీ చేస్తారు.

ప్రత్యక్ష పరిశీలనలో సంతృప్తి చెందిన తర్వాతనే అత్యుత్తమ గనులను 5-స్టార్ రేటింగ్ గనులుగా ఎంపిక చేసి ప్రకటిస్తారు. సింగరేణి సంస్థలో కూడా కోల్ కంట్రోలర్ విభాగం నిపుణుల బృందం ఇటీవల ప్రత్యక్ష పరిశీలన జరిపింది. అనంతరం 5 గనులను 5 స్టార్ రేటింగుకు ఎంపిక చేసింది. సింగరేణి సంస్థ పనితీరుకు, రక్షణ, భద్రత, పర్యావరణహిత చర్యల అమలుకు గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయని ఉత్తమ గనుల అధికారులు పేర్కొంటున్నారు.
4 స్టార్ రేటింగ్ లో మరో 17 గనులు
ఇదిలా ఉంటే 5-స్టార్ కన్నా కొంచెం తక్కువ మార్కులు (80-90 శాతం) సాధించిన గనులను 4 స్టార్ రేటింగ్ గనులు అంటారు. ఈ గనులకు ఎటువంటి అవార్డులు ఇవ్వరు కానీ దాదాపు ఉత్తమ శ్రేణి వరకు వచ్చిన గనులుగా గుర్తింపు వస్తుంది. సింగరేణిలో ఈ సారి 4-స్టార్ రేటింగ్ ను 17 గనులు సాధించడం విశేషం. కొద్ది మార్కుల తేడాతో ఈ గనులు 5-స్టార్ రేటింగ్ ను కోల్పోయాయి. ఇది నుండగా సింగరేణి బొగ్గు పరిశ్రమకు చెందిన ఐదు బొగ్గు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి అత్యుత్తమ బొగ్గు గనులుగా గుర్తింపు పొందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మరింత పనితీరుతో భవిష్యత్తులో మరిన్ని బొగ్గు గనులు ఉత్తమ బొగ్గు గనులుగా అవార్డులను సొంతం చేసుకోవాలని బట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.
