lenin |నాన్నను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న అఖిల్‌

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటించిన ‘లెనిన్‌’ చిత్రం విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. పలు ప్రాంతాల నుంచి హిట్‌ టాక్‌ రావడంతో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో చోటుచేసుకున్న ఓ భావోద్వేగ క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది.

కార్యక్రమానికి హాజరైన అక్కినేని నాగార్జున తన కుమారుడు అఖిల్‌ను గట్టిగా హత్తుకుని అభినందించారు. ఎంతోకాలంగా విజయవంతమైన సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ స్పందన ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది. తండ్రి ప్రేమను ఆస్వాదిస్తూ అఖిల్‌ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారినే కాకుండా అభిమానులను కూడా కదిలించింది.

అఖిల్‌ను ఓదారుస్తూ నాగార్జున పలకరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఈ అరుదైన తండ్రీ–కొడుకుల అనుబంధానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌ అవుతున్నాయి. అఖిల్‌ కష్టానికి తగిన ఫలితం దక్కిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘లెనిన్‌’ చిత్ర విజయోత్సవ వేడుకల్లో చిత్ర బృందం ఆనందోత్సాహాలతో సందడి చేసింది. ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపిన చిత్ర యూనిట్‌, ఇదే ప్రేమను రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరింది. మరోవైపు, అఖిల్‌ భావోద్వేగానికి గురైన ఈ క్షణం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.