- సీఐపై తిరగబడ్డ ప్రజలు
- తీవ్ర ఉద్రిక్తత ..ట్రాఫిక్కు అంతరాయం
గుంటూరు ( ఫిరంగిపురం), ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అర్ధరాత్రి హైటెన్షన్ చోటు చేసుకుంది. గ్రామంలోని శాంతినగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్లెలోని కమిటీ హాల్ మూడుసెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయంలో చిన్నికృష్ణ అనే కుటుంబానికి గ్రామస్తులకు మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ సమయంలో ఓ యువకుడు వీడియో తీస్తుండగా సీఐ రవీంద్రబాబు తుపాకితో దాడి చేశారు. యువకుడికి గాయాలు కావడంతో గ్రామస్తులు సీఐపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. పోలీసులు కారుపై రాళ్లు వేసి ఆందోళన చేపట్టారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళన చేపట్టారు. దీంతో ఆ సెంటర్ లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన సీఐ రెచ్చిపోవడంతో ఓ మామూలు వివాదం శాంతిభద్రతలకే విఘాతం కలిగించే పరిస్థితికి దారితీసింది. ఫిర్యాదు చేసిన వారిపైనే విచక్షణ మరచి తన ప్రతాపం చూపడంతో ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఓ యువకుడిని సీఐ తుపాకీతో కొట్టడంతో న్యాయం చేయాల్సిన తమపైనే దాడి చేయడం ఏమిటని ప్రజలు ముట్టడించడంతో సదరు సీఐ అక్కడి నుంచి జారుకున్నాడు.
ఆగ్రహించిన ప్రజలు స్థానిక అంబేద్కర్ బొమ్మ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఫిరంగిపురం మండల కేంద్రంలోని శాంతిపేటలో పోలేరమ్మ ఆలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆలయ స్థలాన్ని స్థానిక వ్యక్తి ఒకరు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ స్థలంలో షెడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ మురళి తన సిబ్బందితో అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడికి ఫిరంగిపురం సిఐ బి.రవీంద్రబాబు హోంగార్డులతో చేరుకున్నారు. వచ్చీ రావడంతో అక్కడ గుమికూడిన ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు.
ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఫిర్యాదు చేసిన తమపైనే దాడి చేయడం ఏమిటని అక్కడ యువకులు ప్రశ్నించడంతో సీఐ ఆగ్రహానికి గురయ్యారు. తన గన్ బయటకు తీసి అఖిల్ అనే యువకుడిని కొట్టడంతో అతను గాయపడ్డాడు. దీంతో స్థానికులు సీఐ రవీంద్రబాబును ముట్టడించడంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం స్థానికులు సీఐ డౌన్ డౌన్ అంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న గుంటూరు డీఎస్పీ భానుదయ మేడికొండూరు, నల్లపాడు సీఐలు నాగుల్ మీరా, వంశీధర్ తో అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సీఐపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో వారికి సర్దిచెప్పి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.