సర్ ప్రక్రియ విజయానికి రాజకీయ పార్టీల సహకారం అవసరం
- జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు చురుకుగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతతో చేపడుతున్నామని తెలిపారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కృష్ణాజిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరికి ఎన్యుమరేషన్ ఫారం అందజేసి, తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయడం అత్యంత కీలకమన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేస్తున్న జిల్లాగా కృష్ణా నిలిచిందని తెలిపారు. అయినప్పటికీ ఒక్క అర్హ ఓటరు కూడా మిగిలిపోకుండా అత్యంత జాగ్రత్తగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు వాటిని తిరిగి సేకరించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, తర్వాత రావాలని కోరడం, అపార్ట్మెంట్లలో ఒకేసారి ఫారాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం వంటి కారణాలతో ఆలస్యం జరుగుతోందన్నారు. ఇటువంటి సందర్భాల్లో రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని ఫారాలు సకాలంలో తిరిగి అందేలా సహకరించాలని కోరారు.
డెత్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్, అన్ట్రేస్డ్ వంటి అన్‌కలెక్టబుల్ కేసుల విషయంలో కూడా సాధ్యమైనంత వరకు ఫోన్ నంబర్లు సేకరించి సంబంధిత ఓటర్లను సంప్రదించాలని బీఎల్ఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బీఎల్ఓలకు, అందుబాటులో లేని ఓటర్ల ప్రాథమిక జాబితాలను ముందుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులతో పంచుకున్నామని, ఆ జాబితాలను పరిశీలించి సంబంధిత ఓటర్లను గుర్తించి ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయించేందుకు సహకరించాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో మైక్ అనౌన్స్మెంట్లు, ప్రత్యేక ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
జూలై 14లోపు కార్యక్రమం పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలను దృష్టిలో ఉంచుకుని జూలై 12 నాటికే ఎక్కువ శాతం ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆన్లైన్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరిస్తున్నామని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తిగా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జరుగుతోందన్నారు. 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించి కొత్త పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించామని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు నియోజకవర్గాల వారీగా కొత్త పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్‌ను సంబంధిత అధికారులతో పరిశీలించి ఖరారు చేస్తామని వివరించారు.
వేరే జిల్లాలు లేదా రాష్ట్రాల్లో ఓటు ఉన్నవారు ప్రస్తుతం కృష్ణాజిల్లాలో నివసిస్తున్న సందర్భాల్లో, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ దశలో ఓటు మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పేర్లు, ఆధార్ మ్యాపింగ్ లేదా ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు అవసరమైన సహాయం అందిస్తారని స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడమే లక్ష్యమని, ప్రజాస్వామ్య బలోపేతానికి రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు, ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో ఈఆర్వోలు బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డివోలు కే సాంబశివరావు, జి బాలసుబ్రమణ్యం, ఎస్ కరుణ కుమారి, కెఆర్ఆర్సి ఎస్డిసి పి నీలకంటేశ్వరరెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
