వరుణ యాగాలతో వర్షాలు కురవవు..
శాస్త్రీయ ఆలోచనలే పరిష్కారం: విద్యావంతుల వేదిక
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహించి వర్షాలు కురిపిస్తామంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమని తెలంగాణ విద్యావంతుల వేదిక భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్ విమర్శించారు.
ప్రపంచం విజ్ఞాన శాస్త్రంలో వేగంగా ముందుకు సాగుతున్న ఈ కాలంలో ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సిన ప్రజాప్రతినిధులు మూఢనమ్మకాలను ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. వరుణ యాగాలపై ప్రజాధనం ఖర్చు చేయడం కంటే నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కరువు నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(హెచ్) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అని, ప్రజాప్రతినిధులు దీనికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, అటవీ వినాశనం, భూగర్భ జలాల క్షీణత వంటి కారణాలతో వర్షపాతం విధానాలు మారుతున్నాయని, ఈ సమస్యలకు యాగాలు కాకుండా పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణ, నీటి వనరుల సంరక్షణ వంటి శాస్త్రీయ చర్యలే శాశ్వత పరిష్కారమని అన్నారు. వర్షాభావ నివారణకు శాస్త్రీయ, పర్యావరణ పరమైన కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తున్నట్లు రాదండి దేవేందర్ తెలిపారు.
