నిరుపయోగ చెరువులకు పునర్జీవం: కలెక్టర్
గోదావరిఖని, ఆంధ్రప్రభ: నిరుపయోగంగా ఉన్న చేపల చెరువులను పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం రామగుండం మండలంలోని మేడిపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న చేపల చెరువులను ఆయన పరిశీలించారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఏడు చేపల చెరువులు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో వాటిని మరమ్మతులు చేసి తిరిగి చేపల పెంపకానికి అనువుగా తీర్చిదిద్దాలని సూచించారు.
చేపల చెరువుల పునరుద్ధరణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన అమలు చేయాలని, స్థానిక యువతకు చేపల పెంపకంలో శిక్షణ, సాంకేతిక సహకారం అందించి ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సింగరేణి యాజమాన్యం సీఎస్‌ఆర్ నిధుల ద్వారా మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నరేష్ కుమార్ నాయుడు, సింగరేణి ఆర్జీ-1 జీఎం మేనేజర్ లలిత్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
