సాయికృష్ణ కేసులో సిట్ ఎంట్రీ

సాయికృష్ణ కేసులో సిట్ ఎంట్రీ


సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు
ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం నమోదు చేసిన ఏసీపీ దైవప్రసాద్
సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వేగం పుంజుకున్న విచారణ
ప్రభుత్వంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు
సాయికృష్ణ కుటుంబ సభ్యులకు పెరుగుతున్న పరామర్శలు

(విజయవాడ, ఆంధ్రప్రభ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. మాజీ కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం ఆరోపణలతో కేసు నమోదు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) కింద హత్య కేసు, అలాగే అక్రమ నిర్బంధానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

దర్యాప్తు అధికారిగా నియమితులైన ఏసీపీ దైవప్రసాద్ గురువారం సాయికృష్ణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముఖ్యంగా తల్లి విజయలక్ష్మిని దాదాపు రెండు గంటలపాటు ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. అదృశ్యానికి ముందు జరిగిన పరిణామాలు, కుటుంబ సభ్యులకు తెలిసిన అంశాలు, అనుమానాస్పద పరిస్థితులపై వివరాలు సేకరించారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, పోలీసు రికార్డులు, సంబంధిత అధికారుల వాంగ్మూలాలు తదితర ఆధారాలను కూడా దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. కేసులోని ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో విచారించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, సాయికృష్ణ కుటుంబాన్ని పలువురు రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. వంగవీటి ఆశ బాధిత కుటుంబాన్ని కలుసుకుని న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవనున్నట్లు సమాచారం.

దర్యాప్తు వేగవంతం కావడం, సిట్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమకు అండగా నిలిచారని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు.

సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు కావడం, సిట్ ఏర్పాటు నిర్ణయం వెలువడటంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణతో కేసులోని పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.