254 లక్షల టీఎస్‌పీ నిధులతో ఎత్తిపోతల పథకం…

254 లక్షల టీఎస్‌పీ నిధులతో ఎత్తిపోతల పథకం…

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం పడమర మాధవరం-1 వద్ధ మైలవరం బ్రాంచ్ కెనాల్ పై 8,093 కిలోమీటర్ లో 656ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా నీరు అందించటానికి ప్రభుత్వం చేసిన కృషి నేడు నిర్వీర్యం అయిందని, నాలుగు ఇంజన్లు, ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురి అయినట్లు తమ పరిశీలనలో వెల్లడైనట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాథ్ తెలిపారు.
శనివారం ఎ.కొండూరులో విలేకరులతో మాట్లాడుతూ 254.00 లక్షల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వ టీఎస్పీ నిధులతో ఏర్పాటు చేసి వెస్ట్ మాధవరం,రేపూడి గ్రామాల రైతులలో ఎస్ టి లు 137 మంది,ఇతరులకు 12 మందికి మొత్తం 149 మందికి సాగునీరు అందించే లక్ష్యంతో లిఫ్ట్ ప్రారంభించారు. రెండో పంటకు నీరు అందటం వల్ల ఈ ప్రాంతంలో వలసలు నివారించబడ్డాయన్నారు. ఏడుగురు సభ్యులతో నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఊరికి దూరంగా ఉండటం వల్ల కనీస రహదారి కూడా దీనికి లేకపోవటం వల్ల దీని నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
కనీసం సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో దొంగలు దీన్ని అవకాశం గా తీసుకొని షెడ్డు తాళాలను పగలగొట్టి మూడు పెద్ద ఇంజన్లు ఒక చిన్న ఇంజన్ తో సహా దొంగిలించారన్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ లోని వైరులన్నీ కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారన్నారు.ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం కనీసం పట్టించుకోలేదని హరినాథ్ విచారం వ్యక్తం చేశారు. ఇదే గ్రామంలో మూడు ప్రైవేటు వ్యక్తుల ట్రాన్స్ఫారాలు చోరీకి గురైనట్టు తెలిపారు.

రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన 17 ట్రాన్స్ఫారాలు దొంగిలించబడ్డాయని తెలిపారు. సాగరు కాలువ కింద భూములు కోల్పోయిన గిరిజనులకు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని, మా భూములకు నీరు ఇవ్వాలని రాస్తారోకోలు ధర్నాలు ఆందోళన ఫలితంగా ఏర్పడ్డ రెండు ఎత్తిపోతల పథకాలు నేడుమూతపడ్డాయన్నారు. గిరిజనులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతం ఒకప్పుడు ఆదర్శ మండలంగా ప్రకటించబడిందని, ఇది ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఎస్టీల ఓట్లు కీలకంగా మారుతున్నాయన్నారు.

ఈ ఎత్తిపోతల పథకాలు రాకముందు సాగునీరు లేక పొట్ట చేత పట్టుకుని బ్రతుకుతెరువు కోసం లంబాడీలు తూర్పు కృష్ణా ప్రాంతాలకు వలస వెళ్లేవారు. సాగర కాలువ రావడంతో ఒక పంటకు నీరు అందటంతో వలసలు నివారించబడ్డాయన్నారు.2018 నుండి నేటి వరకు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కోటి రూపాయలు పైగా ప్రభుత్వ ఆస్తులు లూఠీ చేయబడ్డాయన్నారు.
ఈ విషయం తెలిసి నిజనిర్ధారణగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్, అఖిలభారత కిసాన్ మహాసభ నేతలు డి. హరినాథ్, బి.పీక్లానాయక్, భూక్యా హరిచంద్, పి.గోవిందు తదితరులు ఆ గ్రామంలో పర్యటించి రైతులతో కలిసి లిఫ్ట్ ప్రాంతాన్ని సందర్శించి, లిఫ్ట్ వాచ్మెన్ ని విచారించగా గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లిన మాట వాస్తవమేనని ఎ.కొండూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, విద్యుత్ ఏఈ, సిబ్బంది వచ్చి చూసి వెళ్లారని,రికవరీ కాలేదని,లిఫ్ట్ దగ్గరకు వెళ్ళటానికి కనీసం రహదారి కూడా లేదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని, నైట్ వాచ్మెన్ ను పెట్టాలని హరినాథ్ తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తక్షణ మే ఈ లిఫ్ట్ ను సందర్శించి 150 మంది రైతులకు ఉపయోగపడే ఈ పథకాన్ని తిరిగి కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులను మంజూరు చేయించి భవిష్యత్తులో ఇలాంటి చోరీలకు గురికాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సాగుదారులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
