CM Revanth Reddy | అధికారులకు కీలక ఆదేశాలు…

CM Revanth Reddy | అధికారులకు కీలక ఆదేశాలు…

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయన్న వాతావరణ శాఖ (IMD) అంచనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వర్షాకాలం, వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా (HYDRAA), విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు శాఖలకు జారీ చేసిన కీలక ఆదేశాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

తెలంగాణ వాటా దక్కాల్సిందే!

మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉన్నందున, అంతరాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా జలాలు వచ్చేలా ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యామ్‌లు నిండిన తర్వాతే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని అప్రమత్తం చేశారు.

మహారాష్ట్రలోని కోయనా డ్యామ్ నీటిని వంద శాతం జల విద్యుదత్పత్తికే ఆ రాష్ట్రం వినియోగిస్తోంది. ఆ మొత్తం నీటిని మనం తీసుకొని, వారికి అవసరమైన విద్యుత్‌ను మనం సరఫరా చేసే అంశంపై మహారాష్ట్ర అధికారులతో చర్చించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.

వరద జలాల మళ్లింపు..

గోదావరి నది నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని, వరద కూడా చాలా స్వల్ప కాలంలోనే వస్తోందని సీఎం గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి, అటు ప్రాణహితల వైపు నుంచి వచ్చే వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలన్నారు.

రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గేట్ల మరమ్మతులు, మెయింటెనెన్స్‌లకు సంబంధించి ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. నిధులు ఎన్ని అవసరమైనా వెంటనే విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ వర్షాకాలంలో ఎక్కడైనా డ్యామ్‌ల విషయంలో ఇబ్బందులు తలెత్తితే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఏఐ (AI) టెక్నాలజీతో రైతులకు అవగాహన

వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్యత, తక్కువ నీరు వినియోగించుకునే పంట రకాల సాగుపై రైతులకు ‘రైతు వేదికల’ ద్వారా అవగాహన కల్పించాలన్నారు.

ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించాలని, టీవీ ఛానెళ్లలోనూ ఇందుకు సంబంధించిన ప్రసారాలు అయ్యేలా చూడాలని చెప్పారు. పంటల సాగుతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా అంతా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

హామీల అమలుపై ఆరా..

గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల అమలు వివరాలపై అధికారులను సీఎం ప్రశ్నించారు. పెండింగ్ పనులపై కారణాలతో నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తక్షణ పరిహారం..

వడగాడ్పులు, వరదల సమయంలో ప్రజలు ప్రాణాలు, ఆస్తులు, పశువులను కోల్పోయినప్పుడు వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదు చేసి బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు. రోడ్లు, వంతెనల నిర్మాణం: వరదల సమయంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కూలిన వంతెనల స్థానంలో నూతన వంతెనల నిర్మాణానికి విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1,000 కోట్లను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని చెప్పారు.

గ్రేటర్ పరిధిలో వాటర్ లాగింగ్ సమస్యలు & తాగునీటి ప్రణాళిక

మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలనే గత నిర్ణయ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీనియర్ అధికారి జయేష్ రంజన్‌ను సీఎం ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తలు

గాలి, దుమ్ము, భారీ వర్షాలు పడిన సందర్భాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నా, లైన్లు తెగిపోయి సరఫరా నిలిచినా తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. వర్షాకాలానికి అవసరమైన సామగ్రిని ముందుగానే సమీకరించుకోవాలని సూచించారు.

స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగిలి

జిల్లాల స్థాయిలో క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు నిర్ణీత స‌మ‌యంలో భేటీ అవుతూ ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగితే ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌న్నారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, మండ‌ల స్థాయిలోనూ రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖల అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగితే స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని సీఎం అన్నారు.

Leave a Reply