Cyclone | భారీ వర్షాలు..

Cyclone | భారీ వర్షాలు..
- నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
- ప్రభావం చూపిస్తున్న దిత్వా తుఫాను
- సముద్రంలో ఎగసి పడుతున్న అలలు
నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లా పై తన ప్రభావాన్ని చూపుతోంది. జిల్లా అంతటా వర్షపాతం నమోదు అయ్యింది. శనివారం సాయంత్రం నుంచే జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసాయి. పొలాలన్నీ నీటితో నిండి పోతున్నాయి. నెల్లూరు నగరం జలమయంగా మారింది. జిల్లాలో సగటున 22.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఆదివారం ఉదయం నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. మరో వైపు విశేష తీర ప్రాంతం కలిగిన నెల్లూరు జిల్లాలో సముద్రం అలజడిగా మారింది.
భీకరమైన అలలతో సముద్రం ఎగసిపడుతోంది. మత్స్యకారులు (Fishermen) ఎవరూ వేటకు వెళ్ళకుండా అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తుఫానును ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్దంగా ఉన్నామని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రభకు తెలియచేసారు. జిల్లాలో అన్నీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పని చేయాలని, ప్రత్యేకించి తీర ప్రాంత మండలాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. కాగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలు కూడా తుఫాను విషయంలో అధికారులకు దిశా నిర్దేశం చేసారు.
