హాసిని పుట్టినరోజు.. అనాథ బాలికల ముఖాల్లో చిరునవ్వులు
పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరిపిన పల్లా కిరణ్
ఖమ్మం, ఆంధ్రప్రభ: ప్రముఖ సామాజిక సేవకుడు పల్లా కిరణ్ తన కుమార్తె పల్లా హాసిని పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం శాంతినగర్‌లోని శాంతినగర్ బాలబాలికల పాఠశాలలో చదువుతున్న నిరుపేద బాలికలకు ఆరు నెలలకు సరిపడా శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు.
అనంతరం సెయింట్ మేరీస్ బాలికల హాస్టల్లోని అనాథ బాలికలకు కొత్త పాదరక్షలు అందజేశారు. బాలికల మధ్య కేక్ కట్ చేసి వారికి కేక్, చాక్లెట్లు పంచిపెట్టారు. అవసరంలో ఉన్న చిన్నారులకు అండగా నిలుస్తూ హాసిని పుట్టినరోజును అర్థవంతంగా జరుపుకోవడం అందరి ప్రశంసలు అందుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు ఆనందం వ్యక్తం చేశారు. పల్లా కుటుంబ సేవా స్ఫూర్తిని పలువురు కొనియాడారు.
అవసరాన్ని గుర్తించి అండగా
శానిటరీ ప్యాడ్లు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థినులు, పాదరక్షలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనాథ బాలికల పరిస్థితిని తెలుసుకున్న పల్లా కిరణ్ వెంటనే స్పందించారు. తన కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని వారికి అవసరమైన సామగ్రిని అందజేశారు.
కీ.శే. పల్లా జాన్రాములు చూపిన ప్రజాసేవా మార్గంలోనే ముందుకు సాగుతున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటిచెప్పారు. సేవా కార్యక్రమాలే నిజమైన వేడుకలని ఆయన అభిప్రాయపడ్డారు. బాలికల ఆరోగ్యం, గౌరవప్రదమైన జీవనానికి శానిటరీ ప్యాడ్లు ఎంత అవసరమో వివరించారు. చిన్నారులకు అందించిన పాదరక్షలు వారి నిత్యజీవితంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.
సేవే కుటుంబ సంప్రదాయం
గత రెండు దశాబ్దాలుగా పల్లా కిరణ్ వివిధ సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఉచిత మెగా వైద్య శిబిరాలు, కరోనా సమయంలో వేలాది కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, వరద బాధితులకు సహాయక చర్యలు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు.
వృద్ధులు, వికలాంగులు, మహిళలు, అనాథలు, యువతకు అవసరమైన సమయంలో చేయూతనందిస్తూ వస్తున్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడమే తన లక్ష్యమని పల్లా కిరణ్ తెలిపారు. హాసిని పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కూడా అదే సేవా భావానికి నిదర్శనంగా నిలిచింది. సేవకు వయసు, సందర్భం అడ్డుకాదని ఆయన మరోసారి చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
