ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన..

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి గ్రామంలో శుక్రవారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దేవాలయాలు సమాజానికి శాంతి కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆలయ అభివృద్ధికి తాను అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
