ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి
కాజీపేటలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్‌పాయ్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కాజీపేట పట్టణంలోని డీజిల్ కాలనీ, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ వార్డుల వారీగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, కుటుంబ సభ్యుల వివరాల నమోదు, నింపిన ఫారాల సేకరణ, డిజిటలీకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడి ఫారాల పంపిణీ, వివరాల నమోదుపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, నింపిన ఫారాలను సకాలంలో సేకరించి ఎన్నికల సంఘం నిర్దేశించిన యాప్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ఓటర్ల వివరాల నమోదు సమయంలో పూర్తి ఖచ్చితత్వం పాటించాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను నివృత్తి చేయాలని బూత్ స్థాయి అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించి ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఫారాలు నింపే క్రమంలో నిరక్షరాస్యులు ఉన్నట్లయితే బీఎల్‌ఓలు బాధ్యత తీసుకుని, ఓటర్ల నుంచి సరైన సమాచారాన్ని సేకరించి ఫారాలను పూర్తి చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసి డిజిటలీకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ పరిశీలనలో కాజీపేట తహసీల్దార్ రాజు, బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
