ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఎమ్మెల్యే

అచ్చంపేట, జూలై 7 (ఆంధ్రప్రభ): అచ్చంపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో శ్రీ మహాలక్ష్మి మ్యాక్సీ విజన్ ఈహెచ్‌ఎస్ ఐ హాస్పిటల్ సహకారంతో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం నుంచి కొనసాగిన ఈ శిబిరానికి అచ్చంపేటతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య నిపుణులు ప్రతి ఒక్కరికీ సమగ్రంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, వైద్య సలహాలు అందించారు. కంటి శుక్లాలు (క్యాటరాక్ట్) ఉన్నట్లు గుర్తించిన రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులకు ఈ శస్త్రచికిత్సలు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, కంటి చూపు మనిషికి భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరమని, చిన్నచిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ నిరంతరం కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, అర్హులు అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగరేకుల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి కానోజు మనోహర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ ఉపాధ్యక్షుడు కందికొండ శ్రీధర్, కోశాధికారి పోకల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైద్య బృందం, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.