ములుగులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..

తొమ్మిది అనుమానిత వాహనాలు సీజ్

అపరిచితులకు ఆశ్రయం కల్పించొద్దు..

అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించండి: డీఎస్పీ రవీందర్

ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా పరిధిలోని బంజారుపల్లి గ్రామంలో మంగళవారం ములుగు డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో ములుగు, వెంకటాపూర్ పోలీసుల సంయుక్త బృందం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.

ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని తొమ్మిది అనుమానిత వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో సంచరిస్తున్న అనుమానిత వ్యక్తులను ఫింగర్‌ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. తమ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామంలో ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై ఉంటే వారి వివరాలు అందించాలని, వారికి అవసరమైతే పునరావాస కేంద్రాలకు (రిహాబిలిటేషన్ సెంటర్లకు) తరలించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గంజాయి విక్రయం లేదా సరఫరాకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని అందిస్తే, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ములుగు సీఐ సురేష్, వెంకటాపూర్ ఎస్సై రాజు, ములుగు ఎస్సై చంద్రశేఖర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.