అగ్నిమాపక వీరులకు నివాళి…
అగ్నిమాపక వీరులకు నివాళి…
భద్రతపై అవగాహనకు శ్రీకారం..
విజయవాడలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభం…
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ప్రారంభం..
అమరవీరుల స్మరణ… ఆకర్షణీయంగా ఆధునిక పరికరాల ప్రదర్శన..
భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి..
డీజీపీ హరీష్ గుప్తా..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్‌పేటలోని ఫైర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ డీజీ వెంకట రమణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను డీజీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, అగ్నిమాపక వారోత్సవాలు కేవలం స్మరణ దినం మాత్రమే కాకుండా, ప్రజలకు అగ్నిమాపక శాఖ సేవల ప్రాముఖ్యతను తెలియజేసే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. 1944లో ముంబై డాక్ పేలుడు ఘటనలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందిని స్మరించుకుంటూ ఈ వారోత్సవాల ఆరంభం జరిగిందన్నారు.

వారి త్యాగం నేటి అగ్నిమాపక సేవలకు పునాది అయిందని వివరించారు. ప్రమాద సమయాల్లో సాధారణ ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తే, అగ్నిమాపక సిబ్బంది మాత్రం లోపలికి వెళ్లి ప్రాణాలను రక్షిస్తారని పేర్కొన్నారు. ఇది క్రమశిక్షణ, ధైర్యం, సేవా నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ డేటా, సాంకేతికత ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోందన్నారు.

ఇటీవల ఆధునిక పరికరాలను సమకూర్చుకోవడం ద్వారా శాఖ సామర్థ్యం మరింత పెరిగిందని చెప్పారు. బాణసంచా, రసాయన పరిశ్రమలు వంటి ప్రమాదకర రంగాల్లో భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ హెచ్చరించారు. వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు భద్రతా పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విపత్తు నిర్వహణలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, తుఫానులు, వరదలు, భవనాల కూలిపోవడం వంటి ఘటనల్లో ముందుగా స్పందించేది అగ్నిమాపక సిబ్బందేనని చెప్పారు.
ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణ మనందరి ఉమ్మడి బాధ్యతగా భావించి, అగ్నిమాపక, పోలీస్, విపత్తు నిర్వహణ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో అగ్నిమాపక భద్రతలో సాంకేతికత కీలక పాత్ర పోషించనుందని డీజీపీ హరీష్ గుప్తా స్పష్టం చేశారు.
