ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు

ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు

  • సీపీఐ(ఎంఎల్) లిబరేషన్

టేకుమట్ల, ఆంధ్రప్రభ : ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) విధానం కారణంగా ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టేకుమట్ల మండలంలోని అనేక గ్రామాల్లో ఉపాధి పనులు చేసిన కూలీలకు హాజరు నమోదు కావడం లేదని, ఫోటో అప్‌లోడ్ సమస్యల వల్ల వేతనాలు కూడా అందడం లేదని తెలిపారు. సాంకేతిక వైఫల్యాలు, సంబంధిత టెక్నికల్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మండలంలోని పలు గ్రామాల్లో ఎలాంటి కారణం లేకుండా జాబ్ కార్డులను తొలగించారని, వాటిని తిరిగి నమోదు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. చట్టం ప్రకారం వారానికి ఒకసారి వేతనాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, మూడు నెలలుగా కూలీలకు పారితోషికం అందలేదని చెప్పారు.

పనిచేసే ప్రాంతాల్లో కనీస తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం, ప్రమాద బీమా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మండుతున్న ఎండలో పనిచేస్తున్న కూలీలకు అదనంగా వేసవి అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ముఖ గుర్తింపు కోసం గంటల తరబడి కూలీలు వేచి ఉండాల్సి వస్తోందని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, అవసరమైతే పాత పద్ధతిలోనే హాజరు నమోదు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో కూలీలను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply